బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఓ యూట్యూబర్‌కు లీగల్ నోటీసులు పంపింది. కేవలం 7వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్‌కి నోటీసులు పంపడంతో నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆ యూట్యూబర్‌కి ఈ క్రమంలో 37కే సబ్స్క్రైబర్లు పెరగడం విశేషం.
Sonam Kapoor: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపైన ఎప్పుడూ రూమర్స్, ట్రోల్స్ వస్తుంటాయి. వీటిని కొందరు సెలబ్రిటీలు పట్టించుకోరు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో తనపై వచ్చే రూమర్స్‌కి ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఈక్రమంలోనే ఆమె తాజాగా ఓ యూట్యూబర్‌కి లీగల్ నోటీసులు పంపడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. సోనమ్ కపూర్ ఆమె భర్త ఆనంద్ అహుజాల కాస్ట్యూమ్స్ బ్రాండ్ల గురించి రాగిణి అనే యూట్యూబర్ ఓ వీడియో చేశారు. ఇందులో సోనమ్ దంపతుల గురించి కామెడీగా మాట్లాడారు. ఈ వీడియో సోనమ్ కపూర్ వరకు చేరడంతో ఆమె స్పందించారు. ఆ వీడియోల్లో కంటెంట్ సోనమ్ బ్రాండ్లను తక్కువ చేసే విధంగా ఉంది. దేశంలో మా బ్రాండ్లను కొందరు దిగజార్చే ప్రయత్నం చేస్తారని భయంతో రాగిణి అనే యూట్యూబర్‌కు ఆమె లీగల్ నోటీసులు పంపారు.
ఈ విషయంపై యూట్యూబర్ రాగిణి స్పందిస్తూ.. ఇలా వివరణ ఇచ్చారు. ‘నా వీడియో కింద ఎప్పుడూ ఒక నోట్ ఉంటుంది. నేను చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమేనని రాసి ఉంటుందని రాగిణి తెలిపింది. సోనమ్ పంపిన లీగల్ నోటీసులను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు సోనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 7వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ కామెడీ కోసం వీడియో చేస్తే ఇలా చేస్తారా? పెద్ద షోల్లో ఎలాంటి కామెంట్స్ చేసినా నవ్వుతారు. ఇలాంటి వాళ్లకు మాత్రం నోటీసులు పంపుతారని’ నెటిజన్లు సోనమ్‌ను విమర్శిస్తున్నారు. రాగిణి ఛానల్‌కు ఇంతకు ముందు 7వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సోనమ్ నోటీసులు పంపిన తర్వాత ఒక్కరోజులోనే సబ్స్క్రైబర్లు సంఖ్య 37వేలకు పెరిగింది.