Cyber Attack: చైనా అతిపెద్ద ICBC బ్యాంక్‌పై సైబర్ ఎటాక్
చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ICBC అమెరికా యూనిట్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్ ట్రెజరీ ట్రేడ్లను నిర్వహించలేకపోయింది. పాత సోవియట్ యూనియన్‌లో లేని దేశాలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు సంస్థ చెబుతోంది.
Cyber Attack: చైనా(China)కు చెందిన అతిపెద్ద బ్యాంకు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ICBC)పై సౌబర్ దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ఈ బ్యాంక్‌పై సైబర్‌దాడి జరిగిందని నవంబర్ 9న సంస్థ వెల్లడించింది. ఆ క్రమంలోనే యూఎస్ ట్రెజరీ ట్రేడ్లను నిర్వహించలేకపోయామని ఐసీబీసీ పేర్కొంది. అయితే ఈ దాడి ఎక్కువగా ప్రభావం చూపకముందే అప్రమత్తం అయిన టీమ్ వెంటనే దెబ్బతిన్న సిస్టమ్‌ల నుంచి లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్ వేర్స్‌ను డిస్ కనెక్ట్ చేసినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలో కొంత సమయం ట్రేడ్లను నిలిపివేయాల్సి వచ్చిందని, తరువాత అల్టర్నేట్ మార్గాల ద్వారా సెటిల్ చేసినట్లు కంపెనీ వివరించింది.
ఈ దాడిపై దర్యాప్తు సంస్థలకూ సమాచారం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. మెయిల్, బ్యాంకింగ్ సహా ఇతర ఏ వ్యవస్థలపై దాడి జరగలేదని స్పష్టం చేసింది. రష్యన్ మాట్లాడే ర్యాన్సమ్వేర్ సిండికేట్ అయిన లాక్‌బిట్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాత సోవియట్ యూనియన్‌లో లేని దేశాలపై ఈ గ్రూప్ సైబర్ దాడులకు పాల్పడుతుందని సమాచారం. లాక్‌బిట్ ransomware దాడులు సాధారణంగా ఫిషింగ్ ఇమెయిల్‌తో కంపెనీ నెట్‌వర్క్‌కు యాక్సెస్ పొందే ప్రయత్నం చేస్తాయి. తరువాత కంపెనీ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తారు. ఆ తర్వాత లావాదేవిల గురించి చర్చించి..బ్లాక్ మెయిల్ చేస్తారు. 2019 నుంచి ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ వేలాది సంస్థలపై సైబర్‌దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.