»Astrazeneca Admits Its Covid Vaccine Covishield Can Cause Rare Side Effect
Covishield : కోవీషీల్డ్‌తో సైడ్ఎఫెక్ట్స్ అరుదుగా ఉండొచ్చన్న ఆస్ట్రాజెనికా!
తమ కోవీషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌తో కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు లేకపోతేదని బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రోజెనికా కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Covishield Side Effects : కరోనా సమయంలో కోవీషీల్డ్(COVISHIELD) వ్యాక్సిన్లను(VACCINES) భారత్‌లో సైతం చాలా మంది వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ని బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అరుదుగా ఉండొచ్చని ఆస్ట్రాజెనికా కోర్టుకు తెలిపింది. ఎందుకంటే..?
బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆస్ట్రాజెనికాపై(AstraZeneca) పలు కేసులు నమోదు చేశారు. వారి కోవీషీల్డ్ టీకా వల్ల కొన్ని సందర్భాల్లో మరణాలు, తీవ్ర గాయాలు, అనారోగ్యాలు వచ్చాయని ఆరోపిస్తూ 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. బ్రిటన్ హైకోర్టులో ఈ విషయమై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వీటన్నింటిపై ఆస్ట్రాజెనికా(AstraZeneca) సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.
కోర్టుకు ఈ విషయంపై ఆస్ట్రాజెనికా తన వాదనను వినిపించింది. చాలా అరుదుగా మాత్రమే తమ టీకా వల్ల దుష్ప్రభాలు(SIDE EFFECTS) ఎదురయ్యే అవకాశం ఉందని అంగీకరించింది. రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం లాంటి పరిస్థితులకు దారి తీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొంది. దీంతో పరోక్షంగా ఈ ఆరోపణలను ఒప్పుకున్నట్లే అయ్యిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.