Mouth Breathing : నోరు తెరిచి నిద్ర పోతున్నారా? ఈ సమస్యలు పక్కా!
కొంత మందికి నిద్రలో నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. అది ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కొన్ని అనారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో మరి మనమూ తెలుసుకుందాం.
Mouth Breathing Side Effects: చిన్న పిల్లలతో పాటు, కొంత మంది పెద్ద వారు కూడా నిద్ర పోయేప్పుడు నోరు వదిలేసి పడుకుంటారు. దాని ద్వారానే గాలిని పీలుస్తారు. అయతే ఇది ఏమంత మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనం కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుందని అంటున్నారు. అవేంటో తెలుసుకుని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
కొంత మంది జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ కారణంగా నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు. అయితే మరి కొందరికి మాత్రం తెలియకుండానే ఇది అలవాటుగా మారిపోతుంది. ఇలా నోటి నుంచి గాలి పీల్చుకోవడం వల్ల చాలానే నష్టాలు ఉన్నాయి. ఇలా చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా నోరు, గొంతు పొడిబారిపోతాయి. దీంతో దగ్గు, గురక లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కూడా రావొచ్చు. 2016లో జరిగిన ఓ అధ్యయనంలో నోటితో గాలి పీల్చే వారికి నిద్రా పక్షవాతం వచ్చే అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది.
ఇలా నోటితో గాలిని పీల్చే అలవాటు(ORAL BREATHING) వల్ల నోరు పొడిబారిపోతుంది. దీంతో దంత క్షయం, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర లేమి, చెవి నొప్పి, ఏకాగ్రత లోపం లాంటి సమస్యలూ రావచ్చు. ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు మనలోకి ప్రవేశించే గాలి శ్వాస మార్గాల్లో వేడెక్కి తేమతో కూడి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులు సులభంగా రక్తంలోకి ఆక్సిజన్ని పంప్ చేస్తాయి. అదే నోటితో గాలి పీల్చడం వల్ల రక్తంలోకి తక్కువ ఆక్సిజన్ చేరుతుంది. ఫలితంగా తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, అలసట లాంటివి సంభవిస్తాయి. ఎక్కువ రోజుల పాటు ఇదే కొనసాగితే హైబీపీ, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి తీవ్ర సమస్యలనూ ఫేస్ చేయాల్సి ఉంటుంది.