»Sleep Deprivation How Lack Of Sleep Affects Your Entire Body Know All About Its Side Effects
Sleeping Late : ఆలస్యంగా నిద్రపోతున్నారా? తిప్పలు తప్పవ్!
కొంత మందికి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి వరకు టైం పాస్ చేసి తర్వాత ఎప్పుడో పడుకుంటారు. ఫలితంగా ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
Sleeping Late At Night : ఈ మధ్య కాలంలో ఫోన్లు, టీవీలు చూస్తూ లేట్ నైట్ వరకు చాలా మంది పడుకోవడం లేదు. అలాగే ఉద్యోగంలో నైట్ షిఫ్టులు ఉన్న వారికి సైతం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఒక రోజో, రెండు రోజులో చేస్తే ఫర్వాలేదు కానీ.. దీర్ఘ కాలం పాటు ఇదే అలవాటు గనుక ఉంటే మాత్రం తిప్పలు తప్పవు. ఇలా ఆలస్యంగా పడుకోవడం(Sleeping Late) వల్ల అనేక సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలస్యంగా నిద్ర(Sleep) పోయే వారిపై బ్రిటన్లో తాజాగా ఓ అధ్యయనం జరిగింది. దీనిలో 73,000 మంది డాటాను పరిశోధకులు విశ్లేషించారు. రకరకాల కోణాల్లో ఈ డాటాను సరిచూశారు. ఏ సమయంలో పడుకుంటున్నారు? ఎంత సేపు పడుకుంటున్నారు? ఏ సమయంలో లేస్తున్నారు లాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇలా నిద్రపోయే వేళల్లో తేడాల వల్ల మానసిక అనారోగ్యం, ప్రవర్తనలో నిలకడ లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని తేల్చారు.
ఇలా ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచే వారు పగటి పూట చురుగ్గా ఉండలేరు. వారి మెదడు సరిగ్గా పని చేయదు. ఒత్తిడి, ఆందోళనల్లాంటివి ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలంలో ఇది అల్జీమర్స్ లాంటి వ్యాధులకూ కారణం కావొచ్చు. వీరికి నిద్రలేమి సమస్యలూ తలెత్తవచ్చు. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్, హైబీపీ, డయాబెటిస్, స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చర్మ సంబంధమైన ఇబ్బందులూ తలెత్తుతాయి. అకారణంగా బరువు పెరుగుతారు. ఇలా అనేకానేక సమస్యలు వచ్చి పడతాయి. అందుకనే సాథ్యమైనంత వరకు ‘అర్లీ టు బెడ్.. అర్లీ టు వేక్’ అనే పద్ధతిని ఫాలో అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.