Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధర
బంగారం ధరలు గత వారం రోజులుగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. మధ్యలో ఒక రోజు పెరిగినా, మళ్లీ సోమవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం కొనుక్కోవాలని చూసేవారు రేటు తగ్గినప్పుడు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలా ధర తగ్గినప్పుడు కొనుక్కోవాలంటే రోజూ దీని రేటుపై ఓ లుక్కేసి ఉంచాల్సిందే. అప్పుడే తక్కువలో దీన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇవాల్టి బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపుగా గత వారంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం మాత్రం స్వల్పంగా పెరిగాయి. అయితే సోమవారం మళ్లీ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. రూ.131 తగ్గడంతో సోమవారం 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,431కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,431గానే ఉంది. అయితే ఈ ధరలో మళ్లీ మార్పు చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఈ ధర కేవలం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నది మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అలాగే నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు అదనంగా మజూరీ, జీఎస్టీల్లాంటి వాటినీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు కొనుక్కునే నగల్లో రాళ్లు ఉంటే వాటికీ వేరేగా ధర కడతారని గమనించుకోవాలి.
ఇక నేడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. గత కొన్ని రోజులుగా ఈ లోహం ధరలు దేశీయ మార్కెట్లో రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.101 పెరిగింది. దీంతో రూ.94,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర పెరిగింది. సోమవారం 9 డాలర్లు పెరిగింది. దీంతో నేడు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2382కు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 31.08 డాలర్లుగా ఉంది.