Bomb Threat At Bhopal Airport : విమానాశ్రయాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) ఈమెయిల్ అందింది. సోమవారం కూడా ఇదే రీతిలో మహారాష్ట్రలోని నాగపూర్, రాజస్థాన్‌లోని జైపూర్, గోవా విమానాశ్రయాలకు సైతం ఈ మెయిల్స్ వచ్చాయి.
తాజాగా భోపాల్ విమానాశ్రయానికి (Bhopal Airport)సైతం బెదిరింపులు రావడంతో ఈ విషయమై ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విశాల్ కుమార్ శర్మ కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసులతోపాటు, ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ ఈమెయిల్స్ వస్తున్నట్లు నిర్ణయానికి వచ్చారు. దీనిపై మరింత నిశితంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ని రంగంలోకి దింపినట్లు చెప్పారు. పోలీస్ డాగ్స్‌ని రంగంలోకి దింపి తనిఖీలు చేయిస్తున్నట్లు వెల్లడించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుందర్ సింగ్ ఈ విషయమై మాట్లాడారు. బెదిరింపు ఈమెయిల్లో ( email) దుండగులు ప్లేన్కు బాంబుల్ని(Bombs) అమర్చి పేల్చనున్నట్లు రాశారన్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా భద్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు.