Bomb Threat : చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం బాంబు బెదిరింపుతో భయాందోళనలకు గురిచేసింది. ఆ తర్వాత ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇండిగో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చెన్నై నుండి ముంబైకి వెళుతున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబైలో అత్యవసర ల్యాండింగ్ తర్వాత, సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారని, భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం, విమానాన్ని ప్రత్యేక బేకు తరలించినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారు. విమానంలో దర్యాప్తు జరుగుతోంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం టెర్మినల్ ప్రాంతానికి తిరిగి వెళ్లనుంది.
తాజాగా ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందన్న సమాచారంతో కలకలం రేగింది. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృందం ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేసి, విమానంలోని వ్యక్తులకు అత్యవసర ద్వారం ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి భద్రతా సిబ్బంది బృందం చేరుకుంది. బాంబు వార్తలతోనే విమానాన్ని ఖాళీ చేయించారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.