Heavy Rain In Mumbai : మహారాష్ట్ర రాజధాని నగరం ముంబయి మరోసారి జలమయం అయ్యింది. శుక్రవారం తాజాగా అక్కడ భారీగా వర్షం పడింది. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ మళ్లీ జలమయం అయ్యాయి. రోడ్లు ములిగిపోయాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. గత సోమవారం సైతం అక్కడ ఇలాగే వర్షాలు కురిశాయి. ఆ వర్షాల నుంచి కోలుకున్న నగరం మళ్లీ నేడు జలమయం అయ్యింది. దీంతో విమాన సర్వీసులకు సైతం తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ముంబయి(Mumbai ) ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఏపీఎంసీ మార్కెట్, కింగ్స్ సర్కిల్, తుర్భే మఫ్కో మార్కెట్, చెంబూరు, పిడిమెల్లో రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్డన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. దీంతో జన జీవనం మళ్లీ స్తంభించిపోయింది. గడచిన 24 గంటల్లో ముంబయిలో సగటున 93.16 మిల్లీ మీటర్ల వర్షం నమోదు అయ్యింది. ముంబయి శివారు ప్రాంతాల్లో సైతం 66.03 మి.మీ, 78.93 మి.మీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది.
ముంబయి మహా నగరంపై ఇప్పటికి కూడా దట్టమైన మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. చీకట్లు కమ్ముకున్నట్లుగా ఉంది. అయితే ఇక్కడ వర్షాలు ఇంకా ఆగిపోలేదు. శుక్ర, శనివారాల్లో మరింతగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ((IMD) వెల్లడించింది. ఈ రోజు కూడా ముంబయిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్(orange alert) జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానికులు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.