»Supreme Court Grants Interim Bail To Delhi Cm Arvind Kejriwal In Liquor Policy Case
Interim Bail : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం.. విడుదల కష్టమే!
మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయినా జైలు నుంచి ఆయన విడుదల కావడం అనుమానంగానే ఉంది.
Interim Bail To Delhi Cm Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం(Delhi Cm) అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు సుప్రీం కోర్టులో(Supreme Court) ఊరట లభించింది. కోర్టు ఆయనకు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మిగిలిన అంశాలపై విచారణ కోసం ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. కేజ్రీవాల్ తనది అక్రమ అరెస్టు అంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఇప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించనుంది.
ఢిల్లీ మద్యం పాలసీని(Liquor Policy) రూపొందించడంలో కేజ్రీవాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనకు రూ.100 కోట్లు ముట్టాయని అంటోంది. ఈ విచారణలో భాగంగా కేజ్రీవాల్‌ని మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు కింద కోర్టు తీర్పుపై స్టే విధించింది. విచారణ అనంతరం బెయిల్‌ని రద్దు చేసింది.
దీంతో బెయిల్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఎట్టకేలకు నేడు ఆయనకు మధ్యంతర బెయిలు(Interim Bail) లభించింది. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రావడం దాదాపుగా కుదరని పనే. ఆయనపై ఇప్పటికే సీబీఐ కేసు కూడా ఉంది. ఆ కేసులో కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్టయ్యారు. దాని విచారణ జరుగుతోంది. దానిలోనూ బెయిల్ లభిస్తే తప్ప ఆయన బయటకు రావడం కష్టమే.