»India Seizes Pak Bound Consignment Of Banned Chemicals From China
Seized : చైనా నుంచి పాక్‌కి నిషేధిత రసాయనాలు.. స్వాధీనం చేసుకున్న భారత్
చైనా నుంచి పాకిస్థాన్‌కి షిప్పులో వెళుతున్న నిషేధిత రసాయనాలను భారత్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పోర్టులో ఆగిన షిప్పులో ఈ నిషేధిత రసాయనాలను మన భద్రతా బృందాలు గుర్తించాయి. అంతర్జాతీయంగా ఈ రసాయనాలపై నిషేధం ఉంది. ఇంతకీ వీటిని ఎందుకు వినియోగిస్తారంటే?
India seized Pak-bound consignment of banned chemicals : పాకిస్థాన్‌కి షిప్పులో వెళుతున్న నిషేధిత రసాయనాలను భారత్(India) సీజ్ చేసింది. తమిళనాడులోని చెన్నై పోర్టులో చెకింగ్‌లో భాగంగా ఓ షిప్ కంటైనర్‌లో ఈ నిషేధిత రసాయనాలను మన భద్రతా సిబ్బంది గుర్తించారు. వీటి ఎగుమతులపై అంతర్జాతీయంగా నిషేధం ఉందని చెన్నై పోర్ట్ అధికారులు వెల్లడించారు. టియర్ గ్యాస్, జీవాయుధాల తయారీలో వీటిని వినియోగిస్తారని అన్నారు.
చైనాకు(China) సంబంధించిన ఓ సంస్థ పాకిస్థాన్‌కి(Pakistan) చెందిన రక్షణ ఉత్పత్తుల సంస్థకు ఈ రసాయనాలకు సరఫరా చేస్తోంది. అర్థో క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ అనే ఈ రసాయనం షిప్పింగ్‌లో ఉండగా ఆ షిప్పు చెన్నైలోని కత్తుపల్లి పోర్ట్‌కు చేరుకుంది. మొత్తం 103 డ్రమ్ముల్లో ఈ రసాయనం నింపి ఉంది. బరువు 2,560 కిలోలుగా ఉంది. ఏప్రిల్ 18న షాంఘై పోర్టులో ఈ షిప్పులోకి లోడ్ అయ్యింది. ఆ షిప్ పాక్‌లోని కరాచీకి బయలుదేరింది.
ఈ క్రమంలో చెన్నైలోని కత్తుపల్లి పోర్టులో షిప్ ఆగింది. అక్కడ కస్టమ్స్ అధికారులు సాధారణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ డ్రమ్ములను నిపుణుల సాయంతో పరీక్షించారు. దీంతో ఈ పీపాల్లో ఉన్నది నిషేధిత రసాయనం(banned chemicals) అని వారు తేల్చి చెప్పారు. దీని ఎగుమతి మీద ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ సరుకును సీజ్ చేశారు. గత మార్చిలో సైతం ముంబయి పోర్టులో ఓ నౌకను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అణు ఆయుధాల తయారీలో ఉపయోగించే సరుకు ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆ షిప్పును అడ్డుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ నౌకలో నిషేధిత రసాయనాలు(banned chemicals) బయటపడ్డాయి.