Anant-Radhika Wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నేడు జరుగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో వీరి పెళ్లికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. దీనితో పాటు బాలీవుడ్-హాలీవుడ్ తారలు, ప్రపంచంలోని చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ముంబైకి చేరుకుంటున్నారు. ఇక ఈ వివాహ వేడుకకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలను ఆహ్వానించారు. ఆకాశమంత పందిరి.. భూదేవంత వాకిలిగా అనంత్, రాధిక పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే పెద్ద నేతలిద్దరూ ముంబై చేరుతున్నారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ముంబై చేరుకున్నారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మమతా బెనర్జీతో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
అనంత్ అంబానీ వివాహ అతిథి జాబితా
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరు కావడానికి ముంబై చేరుకున్నారు. ఆయన అతిథి జాబితాలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరవుతున్నారు. క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్హామ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా వెల్లడైంది. ఆయన ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకు జియో వరల్డ్ సెంటర్కు చేరుకుంటుంది. కాగా అనంత్, రాధిక మర్చంట్ శుభ సమయం రాత్రి 9:30 గంటలకు ఏడడుగులు వేయనున్నారు.