మెక్సికో (Mexico) లో ఘోరం జరిగింది. కాల్ సెంటర్(Call Center)లో జాబ్ మానేసేందుకు సిద్దమైన ఎనిమిది మంది చంపిన ఘటన కలకలం రేపుతోంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్లోని ఓ డ్రగ్ కార్టెల్‌లో (Drug cartel) జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని అమెరికా(America), మెక్సికో అధికారులు ధ్రువీకరించారు. మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్ నడుస్తోంది.మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. అయితే, అందులో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. మే 20-22 మధ్యకాలంలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ కనిపించలేదు. వారంతా 30ఏళ్లలోపు వారే. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి.
వీటికి ఫోరెన్సిక్ పరీక్షలు(Forensic tests) నిర్వహించగా.. అవన్నీ తప్పిపోయిన ఆ కాల్ సెంటర్ ఉద్యోగులవేనని గుర్తించారు.మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్‌గా పేరున్న ఈ జలిసో కొత్త తరం ముఠా.. సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్ అక్రమరవాణా, దోపిడీ, కిడ్నాప్‌ల వంటి వాటికి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల (Real Estate Scam)పేరిట అమెరికన్లు, కెనడియన్లే లక్ష్యంగా ఈ కాల్‌సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు (Police) దర్యాప్తులో తేలింది. అయితే, అందులో పనిచేసే యువతీ, యువకుల దారుణ హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నందునే ఈ దారుణాలకు తెగబడినట్లు దర్యాప్తు (Investigate) అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగుల కుటుంబీకులు మాత్రం తమ పిల్లలు సాధారణ కాల్‌సెంటర్‌లోనే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని దర్యాప్తు సంస్థలకు తెలిపాయి