Crying : ఎంతో బాధలో ఉన్నారా?.. ఓసారి ఏడ్చేయండి ఫర్వాలేదు!
ఏడుపు మంచిది కాదంటారు.. కానీ ఏడుపూ మన మంచికే అంటున్నారు వైద్య నిపుణులు. తీవ్రమైన ఒత్తిడిలో, బాధలో ఉన్న వారు ఓ సారి తనివితీరా ఏడ్చేస్తే దాని నుంచి విడుదలై శరీరం కుదుట పడుతుందంటున్నారు. ఏడుపు వల్లా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..?
Crying Benefits For Health : ఏడిస్తే మంచిది కాదంటారు. ఇంటికి శుభం కాదంటారు. అయితే బాధలో ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా, తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నా.. ఓసారి ఏడ్చేయడం బెటర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా ఏడవకుండా బాధ లాంటి భారమైన ఫీలింగ్స్‌ని లోపలే పెట్టేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు. లోపల ఎలాంటి అసంతృప్తులు ఉన్నా, బాధలున్నా ఓసారి మనస్ఫూర్తిగా ఏడ్చేయమని చెబుతున్నారు. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలూ(HEALTH BENEFITS) ఉన్నాయని చెబుతున్నారు.
మానసికంగా మన ఒత్తిడిని తగ్గించడానికి, శరీరం కుదుట పడి భావోద్వేగాలు కంట్రోల్ అవ్వడానికి ఏడుపు(CRYING) మంచి సాధనంగా పనికొస్తుంది. కష్టంగా ఉన్నప్పుడు కన్నీళ్లు( TEARS) కార్చేయడం వల్ల లోపల భారంగా ఉన్న భావాలన్నీ తేలికవుతాయి. మనసు ప్రశాంతం అవుతుంది. మనకు ఓదార్పు లభించినట్లు అవుతుంది ఏడ్చే క్రమంలో మనలో పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. దీంతో విశ్రాంతి లభించిన భావన కలుగుతుంది.
మనలో ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ఏడుపు(CRYING) చక్కని పరిష్కారం. కన్నీళ్లు పెడుతున్నప్పుడు మనలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. అవి మనలో ఉండే నొప్పులను సహజంగా తగ్గిస్తాయి. మనం గందరగోళమైన భావోద్వేగాలతో ఉన్నప్పుడు నిద్ర దరి చేరదు. అలాంటప్పుడు కన్నీళ్లు కట్టలు తెంచుకుంటే మనసు తేలికవుతుంది. కాస్త హాయిగా అనిపించి నిద్రలోకి జారుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న పిల్లల్లో ఏడుపు అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సహజంగా వారి శ్వాస కోశ నాళాలన్నింటినీ శుభ్రం చేస్తుంది. లేదంటే కఫం లాంటివి పట్టేసి వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.