jamun fruit : నేరేడు పండ్లు వదిలిపెట్టకుండా తినండి.. ఎందుకంటే?
నేరేడు పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే దొరికిన వారు దొరికినట్లుగా వీటిని తినేసే ప్రయత్నం చేసేయండి.
jamun fruit health benefits : మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో నేరేడు పండ్లు మనకు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆషాఢ మాసంలో వీటిని తప్పకుండా తినాలని తెలుగు రాష్ట్రాల్లో ఓ సంప్రదాయం ఉంది. అందుకనే చాలా మంది ఈ మాసంలో ఒక్కసారైనా నేరేడు పండ్లను తినే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీటి ఔషధ విలువలు తెలియని వారు మాత్రం వీటిని తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. వీటిని తినడం వల్ల కలిగి ప్రయోజనాలను(Benefits) ఒక్కసారి తెలుసుకోండి. అప్పుడు వద్దన్నా మీరే వీటిని తింటామంటారు.
నేరేడు పండ్లలో(jamun fruit ) కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం, థయామిన్, విటమిన్ సీ, రైబోఫ్లావిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ లాంటివి పోషకాలు అనేకం ఉంటాయి. అవి అనేక రకాల వ్యాధులను దరి చేరనీయకుండా చేస్తాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో అంతా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని తినడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో చేరతాయి. అవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. శ్వాస నాళాల్ని, ఊపిరితిత్తుల్ని క్లీన్ చేస్తాయి. క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు.
మధుమేహంతో బాధలు పడేవారు నేరేడు పండ్లను(jamun fruit ) చక్కగా తినొచ్చు. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌లో ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెరలు పెరగడం లాంటివి జరగవు. ఇవి వాటి స్థాయిల్ని అదుపు చేయడంలోనూ సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది మనం బరువు తగ్గడానికి సహకరిస్తుంది. నాజూగ్గా తయారవ్వాలని అనుకునే వారు ఎక్కువగా ఈ పండ్లను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటిని తినడం వల్ల ముఖం మచ్చలు లేకుండా నిగనిగలాడుతుంది. మొటిమలు, ముడతల్లాంటివీ తగ్గుతాయి. వీటిలోనే సీ విటమిన్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బోలు ఎముకల సమస్యల్లాంటివి సైతం వీటిని సరిపడనంతగా తినడం వల్ల రాకుండా ఉంటాయి. నీరసం, అలసటల్లాంటివి దరి చేరవు. గుండె జబ్బుల నుంచీ కాపాడతాయి.