Is Coconut Oil Good For Skin or not : ఇదివరకటి కాలంలో చాలా మంది చేతులు కాళ్లకు కొబ్బరి నూనెనే రాసుకుంటూ ఉండేవారు. అప్పట్లో వారికి మాయిశ్చరైజర్ అనే మాటే తెలియదు. చర్మం ఏ కాస్త సమస్య అనిపించినా, దెబ్బ తగిలినా వెంటనే కొబ్బరి నూనె రాసేసుకునే వారు అంతే. అయితే ఈ మధ్య కాలంలో మానకు మార్కెట్లో బోలెడు రకాల మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల బ్రాండ్‌ల్లో ఆకర్షణీయమైన డబ్బాల్లో కనిపించే సరికి వాటినే మనం కొని తెచ్చుకుంటున్నాం. అయితే రసాయనాలు ఉండే ఇలాంటి వాటి కంటే సహజమైన కొబ్బరి నూనె(coconut oil) ఎన్నో రెట్లు మన చర్మానికి మేలు చేస్తుంది.
మన చర్మం, ముఖానికి కొబ్బరి నూనెను(coconut oil) రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు( Benefits) ఉన్నాయి. డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ముఖంపై నల్లటి మచ్చల్లాంటివి ఉన్నా అవి క్రమంగా పోతాయి. కొంత మందికి నిద్ర లేచేసరికి ముఖం ఉబ్బినట్లుగా అవుతుంది. మరి కొంత మందికి కళ్ల కింద వాపులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ కొబ్బరి నూనె పరిష్కారం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గుతాయి. చర్మం టోన్ అవుతుంది. ఎరుపు తగ్గుతుంది.
కొబ్బరి నూనెను(coconut oil) తరచుగా చర్మానికి రాసుకునే వారికి ఇది యాంటీ ఏజింగ్ ఆయిల్లా పని చేస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఫలితంగా చర్మం బిగుతుగా ఉంటుంది. సాగే లక్షణాన్ని కోల్పోదు. అందువల్ల వృద్ధాప్య లక్షణాలు తొందరగా దరి చేరకుండా ఉంటాయి. 2019లో జరిగిన ఓ అధ్యయనంలోనూ ఈ విషయం తేటతెల్లం అయ్యింది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుందని మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు న్యూయార్క్‌లో చేసిన పరిశోధనల్లో తేలింది. ఇంకా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు మేలు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాలను కలగనీయవు. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు డెడ్ సెల్స్‌ను తొలగిస్తాయి. ఇన్ఫెక్షన్లు, అలర్జీలను దరిచేరనీయవు.