Ayodhya Ram Mandhir: కోట్లాది మంది భక్తుల కల నెరవేరింది. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యింది. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులతో పాటు సాధువుల కూడా హాజరయ్యారు. అయితే అయోధ్య బాలరాముడి దర్శన భాగ్యాన్ని అందరూ టీవీల్లో వీక్షించారు. ఈరోజు భద్రత కారణాల దృష్ట్యా సామాన్య పౌరులకు రావద్దని కోరారు. ఇక నుంచి జనవరి 23 నుంచి బాలరాముడి దర్శన భాగ్యం అందరికీ కలగనుంది.
ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు జాగరణ హారతి ఉంటుంది. దీనికి ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. సంధ్యా హారతి రాత్రి 7:30 గంటలకు ఉంటుంది. అందుబాటును బట్టి అదే రోజు బుక్ చేసుకోవచ్చు. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి పాస్‌లు ఉచితంగానే ఇస్తారు. వీటిని ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు.
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అయి ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి హారతి లేదా దర్శనం టైమ్ స్లాట్లను ఎంచుకోవాలి. గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి ఎంటర్ చేసి పాస్ కోసం బుక్ చేసుకోవాలి. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్లో మీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వెళ్లవచ్చు.