»Roof Of Ram Temple In Ayodhya Leaks During Rainfall
Ayodhya : అయోధ్య గర్భ గుడిలో నీటి లీకేజీ.. విగ్రహం ప్రతిష్ఠించిన చోటే!
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే వర్షాలకు నీరు లీకేజీ అవుతున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమై ఇంకా ఆరునెలలు అయినా కాలేదు. అప్పుడే పై నుంచి నీటి లీకేజీలు కలవర పరుస్తున్నాయి. గర్భాలయంలో బాల రాముడి విగ్రహం ఉన్న చోటునే లీకేజీ అవుతుండటాన్ని అక్కడి ప్రధాన అర్చకులు గుర్తించారు. వర్షాలు మరింత పెరిగే లోగానే ఈ లీకేజీలను సవరించాలని లేదంటే పూజలు మరింత కష్టం అవుతాయని వారు చెబుతున్నారు.
ఈ విషయమై అయోధ్య (Ayodhya) ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ మాట్లాడారు. చాలా చిన్న వర్షానికి కూడా ఆలయ కప్పు(Roof) పై నుంచి నీరు లోపలికి వస్తోందని తెలిపారు. ప్రధాన విగ్రహం ఉన్న చోటే ఆ నీరు కారుతోందని చెప్పారు. ప్రారంభంలోనే దీన్ని వదిలేస్తే తర్వాత ఇది పెద్ద సమస్యగా తయారవుతుందని పేర్కొన్నారు. కాబట్టి అధికారులు వెంటనే దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. రామ మందిరం లోపల డ్రైనేజీ వ్యవస్థ లేదని అన్నారు. దీంతో పై నుంచి వచ్చిన నీరు గర్భాలయంలోని విగ్రహం వద్దే ఉండిపోతున్నాయని చెప్పారు.
నిండా ఆరు నెలలైనా కాకముందే ఇలా నీరు లీకేజీ అవుతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర్(Ram Temple ) నిర్మాణ నాణ్యతపై ఇది ప్రశ్నల్ని లేవనెత్తుతోందని అంటున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రూ.1800 కోట్ల అంచనా వ్యయం ఉంది. ఇప్పటి వరకు రూ.3,500 కోట్లు ప్రజల నుంచి, దాతల నుంచి విరాళంగా ట్రస్టుకు అందాయి. 2025 కల్లా ఆలయ నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నారు. అయితే అది అసాధ్యమైని సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నట్లు చెప్పారు.