NSG : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కేంద్రంగా మారబోతోంది. ఇది దేశంలో ఎన్‌ఎస్‌జికి ఆరో కేంద్రం అవుతుంది. ఇది కాకుండా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ త్వరలో పఠాన్‌కోట్, కేరళలో కూడా తన యూనిట్లను సృష్టించనుంది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్‌లలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. కొంత కాలంగా ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయోధ్యలోని యూనిట్ వచ్చే కొద్ది నెలల్లో, మిగిలిన రెండు చోట్ల ఈ ఏడాది చివరి నాటికి పని ప్రారంభం కానుంది.
ప్రత్యేక ఆయుధాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థ
ఈ ఏడాది నాటికి అయోధ్య, పఠాన్‌కోట్, కేరళలో యూనిట్లు పనిచేస్తాయని అధికారి తెలిపారు. ఇది స్థానిక పోలీసు, ఇతర సీఏపీఎఫ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఈ ప్రదేశాల్లోని యూనిట్లు ప్రత్యేక ఆయుధాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో ఉంటాయి. రాడికల్ శక్తులు, పాన్-ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు కేంద్రంగా మారుతున్న సరిహద్దు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని పఠాన్‌కోట్, కేరళలో ఎన్ఎస్జీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది ఎన్ఎస్జీ కేంద్రాలు
కొత్త మూడు హబ్‌లను ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది ఎన్ఎస్జి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కి ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై , గాంధీనగర్‌లలో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ముప్పు, సమీపంలోని సున్నితమైన ప్రదేశాల ఆధారంగా మూడు స్థానాలను గుర్తించినట్లు అధికారి తెలిపారు. జనవరిలో అయోధ్యలో రామమందిరం తెరచుకుంది. ఇది సున్నితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. వివిధ ఉగ్రవాద సంస్థల రాడార్‌లో రామమందిరం ఎల్లప్పుడూ ఉంటుంది.