GDL: అయిజ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని 45 ఏళ్ల వయసు గల మహిళ మృతి చెందినట్లు టౌన్ ఎస్ఐ కళ్యాణ్ రామ్ తెలిపారు. మహిళను గుర్తించిన వారు గద్వాల టౌన్ పోలీసులను సంప్రదించారు. ఆమె మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
HYD: గాంధీనగర్ PS పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కవాడిగూడలో ఇద్దరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గంజాయి సేవిస్తున్న బన్సీలాల్ పెటకు చెందిన పి.సైమన్ (24), బాగ్ లింగంపల్లికి చెందిన డి.లోకేశ్(23)ను తనిఖీ చేశారు.
SKLM: పోలాకి మండలంలో జడూరు గ్రామంలో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శనివారం రాత్రి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ మహిళను, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
JN: కుటుంబ తగాదాలతో చేనేత కార్మికుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన జిల్లాలో జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు కారంపూరి చంద్ర మౌళి(45) రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రకాశం: మార్కాపురం పరిధిలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-ఒంగోలు హైవే పై శనివారం బైక్‌ను, ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్లో ఈనెల 9న ఇంటర్ యువతి లహరి సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెతో పాటు తీవ్రగాయాలపాలైన యువకుడు రాఘవేంద్ర చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచాడు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
E.G: అనపర్తి మండలం రామవరంలో తారాజువ్వ పడి తాటాకు ఇల్లు దగ్ధమైన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమిల్లి లక్ష్మీకాంతం అనే మహిళ గతంలో ఇంట్లో నివాసం ఉండేది. అయితే ఆమె మృతి చెందడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు. ఓ వివాహ వేడుకల్లో భాగంగా తారాజువ్వ పడడంతో పైకప్పుకు నిప్పంటుకుంది. అగ్నిమాపక అధికారులు మంటలు అదుపు చేశారు.
VSP: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని రుషికొండ బీచ్‌లో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. వరుసుగా మూడు రోజులు సుమారు 15 వరకు తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకువచ్చాయి. శనివారం సాయంత్రం సుమారు 10 తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడంతో పర్యవరణ ప్రియులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
E.G: చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం గంజాయితో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని SI శివన్నారాయణ తెలిపారు. ఒడిశా నుంచి కృష జిల్లాకు బైక్‌పై తరలిస్తున్న శిరోజ్, సిద్ధు, ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న యూసఫ్ ఖాన్, మహ్మద్ అలీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 61కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని కొత్త బోయినపల్లి అన్నమాచార్య కాలేజ్ వద్ద కడప – చెన్నై ప్రధాన జాతి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి కిరణ్ అతని స్నేహితుడు బన్నీ ఇద్దరు స్కూటర్‌పై బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో విద్యార్థులు మృతి చెందారు.
WGL: చెన్నారావుపేట మండలం జల్లిలో విషాదం చోటుచేసుకుంది. జల్లి గ్రామానికి చెందిన రాకేశ్ (16) శనివారం సెల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లోని లోపంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
కృష్ణా: పెడన మండలం నందిగామ నీటి సంఘం ఎన్నికల్లో ఎన్నికల అధికారి జి. మధుశేఖర్‌పై శనివారం కత్తితో దాడి చేశారు. ఓ పార్టీలో ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరుతో మర్తి వెంకటేశ్వరరావుకి 2 ఓట్లు రావడంతో ఆగ్రహించారు. దీంతో ఆయన ఎన్నికల అధికారి చేతిలో ఉన్న కాగితాలను చింపి అధికారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి మధుశేఖర్‌ని ఆస్పత్రికి తరలించారు.
NDL: బేతంచర్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న గుండా మోహన్ రావు అనే వ్యక్తి ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుకు గబ్బిలాలు అధికంగా ఉండడంతో శనివారం సాయంత్రం నిప్పు అంటించారు. మంటలు పైకి లేవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కొబ్బరి చెట్టు నిండా గబ్బిలాలు అధికంగా ఉండడంతో కొబ్బరి చెట్టుకు నిప్పంటించినట్లు ఇంటి యజమాని తెలిపారు.
PLD: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి సమీపంలో శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.