ADB: పెండింగ్‌లో ఉన్న ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సంతకాల సేకరణ చేపట్టి శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారానే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బైక్ పై గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లను సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా వారిని ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
MDCL: వరి సాగులో ఆధునిక టెక్నాలజీని వదిలి రైతన్నలు మళ్లీ నాట్ల వైపు మొగ్గు చెబుతున్నారు. కూలీల ఖర్చులు, శ్రమ తగ్గించే ఆధునిక టెక్నాలజీ అయిన డ్రం సీడింగ్, వెదజల్లే పద్ధతి, డైరెక్ట్ కల్టివేషన్ విధానాలతో కలుపు పెరుగుతోంది. వరి నారు సరైన క్రమ పద్ధతిలో రావడం లేదని, దీంతో నష్టం వస్తున్నట్లుగా శామీర్‌పేట ప్రాంతంలో పలువురు రైతులు తెలిపారు.
WNP: ఆత్మకూరు మండలం కత్తెపల్లె గ్రామంలో ఆదివారం నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక ప్రదేశంలో కొంతకాలంగా చీకటిగా ఉండడంతో నూతన స్తంభాలు ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి నూతన స్తంభాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు.
KNR: అంతర్జాతీయ యుద్ధ మేఘాలు నగరంలోని సామాన్యుల ఉపాధిని దెబ్బతీశాయి. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా కరీంనగర్ కమాన్ వద్దనున్న ‘శ్రీ లక్ష్మీ టిఫిన్ సెంటర్’ సోమవారం నుంచి మూతపడింది. గ్యాస్ సరఫరా లేక దుకాణం నడపలేకపోతున్నామని యజమాని ఆవేదనతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో యజమానితో పాటు అక్కడ పనిచేసే కార్మికులు వీధిన పడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
BHNG: పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన కైరం కొండ శ్రీకాంత్ అనారోగ్యంతో మరణించారు. ఆయనతో కలిసి చదివిన ZPHS 2004- 2005 SSC బ్యాచ్ స్నేహితులు రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీకాంత్ తల్లికి అందించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, ప్రకాష్, కిరణ్, ప్రవీణ్, బాలకృష్ణ, పాల్గొన్నారు.
NLG: సీఐటీయూ (CITU) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ సలీం, కోశాధికారిగా ప్రమీల ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా డబ్బీకారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, సైదులు, దండంపల్లి సత్తయ్య, రాజు, మల్లు గౌతమ్‌రెడ్డి, బయన్నతో పాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా జిల్లా మహాసభలలో ఎన్నుకున్నారు.
HYD: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని వెంగళరావుపార్కులో పాడైపోయిన ఈ-వేస్టేజ్ వస్తువులను సేకరించింది. ఈ స్పెషల్ డ్రైవ్‌కు స్థానికంగా ఉన్న నివాసితుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల పరిశీలించారు.
MLG: యుద్ధం కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న అపోహలను తొలగించేందుకు గోవిందరావుపేట మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా RSI సునీల్ మాట్లాడుతూ.. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 45 రోజుల వ్యవధిలోనే బుకింగ్ చేసుకోవచ్చన్నారు. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు.
KMM: పెనుబల్లి మండలంలోని వీ.ఎం.బంజర్ రింగ్ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం ఓ డీసీఎం వ్యాన్ కలకలం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి, మూసి ఉన్న చెప్పుల దుకాణంలోకి వాహనం దూసుకెళ్లింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
HYD: D.Ed, B.Ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారపు పవన్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు HYDలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. దీనిపై నిరుద్యోగ అభ్యర్థుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతూ తామూ పాల్గొంటామని ఆమె తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన గుర్రాల చెన్నయ్యకు అంబేడ్కర్ నేషనల్ అవార్డు లభించింది. B.S.A నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా మార్చి 15న తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు. సమాజ అభివృద్ధి, బహుజనుల అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు.
KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నేడు నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని, అందిన అర్జీలను అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారనీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వాడుకోవాలని కోరారు.
WGL: వరంగల్-కాజీపేట స్టేషన్ మధ్య శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్ జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద బస్సు, సినిమా టికెట్లు లభించగా ఇతర గుర్తింపు ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.