KMM: కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతమైంది. సర్పంచ్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కిషోర్, వైద్యులు రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంపు ప్రారంభించారు. 187 మంది రోగులు ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. 54 మంది రోగులకు రక్త పరీక్ష సేకరణను జరిపి మిగిలిన వారికి మందులు పంపిణీ చేశామన్నారు.
VKB: దౌల్తాబాద్ మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను సీఎండీ తేజస్వి పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ వినియోగం, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, పవర్ సేవింగ్‌పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నగర మేయర్ మహంకాళి స్వామి సోమవారం భూమి పూజ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి పాల్గొన్నారు.
MNCL: సీపీఎం అనుబంధ రైతు సంఘం సమావేశం సోమవారం మంచిర్యాలలో జరిగింది. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొండగొర్ల లింగన్న, బోడంకి చందు, ఉపాధ్యక్షులుగా దుర్గ ప్రసాద్, బండారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిలుగా ముడితే వెంకటేష్, శంకరయ్యను ఎన్నుకున్నారు.
WNP: వనపర్తి మున్సిపాలిటీలో 100% పన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందికి ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వసూలు పూర్తి చేయాలని సూచించారు. పట్టణవాసులు బిల్లుల సకాలంలో చెల్లించాలని సూచించారు.
KNR: శంకరపట్నం మండలం తాడికల్ రాజీవ్ రహదారి వద్ద వాటర్ ట్యాంక్ సమీపంలో కారు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అన్నారం గ్రామానికి చెందిన పాకాల రాఘవరెడ్డి (51) గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NZB: జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు చేయరాదన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. ఈ నిబంధనలు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.
WNP: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం రూ.18000గా నిర్ణయించాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని CITU ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పూర్తయిన నేటికీ ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు.
NLG: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ‘విబిజి రాంజీ’ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేత కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని, సాంకేతిక సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని 7 వారాలుగా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే చర్యలను విడనాడాలని ఆయన హెచ్చరించారు.
SDPT: రీజనల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. సోమవారం గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలోని మీటింగ్ హాల్లో జగదేవపూర్ మండలం చేబర్తి, అలిరాజిపేట, పిర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మహిళల ఖో-ఖో జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి 31 వరకు కర్ణాటకలో జరిగే సౌత్ జోన్ ఖో-ఖో టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు.
SRPT: మోతె మండలంలోని ఆన్నారిగూడెం గ్రామంలో ఇవ్వాళ ఉదయం అంకిరెడ్డి మల్లయ్య నివాసంలో అగ్నిప్రమాదం సంభవించి ఒక కారు, మోటార్ సైకిల్, ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితుడిని పరామర్శించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.
కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు 25వ నంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు స్పందించాలని పేర్కొన్నారు.
KMM: ఖమ్మం 48వ డివిజన్‌కు రెండవ విడతలో భాగంగా పారిశుద్ధ్య పనుల కోసం నూతన ట్రాక్టర్‌ను కేటాయించారు. ఈ నూతన ట్రాక్టర్‌ను కార్పొరేటర్ తోట గోవిందమ్మ వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. విస్తారంగా ఉన్న 48వ డివిజన్‌లో చెత్తను నిర్మూలించడం కోసం ట్రాక్టర్ కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
NRML: DWOగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన గాజుల వినూత్నను సోమవారం స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వినూత్న హామీ ఇచ్చారు.