NLG: దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 275 మంది గ్రామస్థులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని కంపెనీ ప్రతినిధి మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలేటి సంధ్య, ఎండీ యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.
NGKL: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మత్స్యకారుల అభివృద్ధికి బడ్జెట్లో రూ. 5000 కోట్లు కేటాయించాలని కోరుతూ పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. జిల్లా కన్వీనర్ శంకర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ. 986 కోట్లతో పాటు ఎక్స్రేషియాతో పాటు రూ. 50 కోట్లు కలిపి బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు.
ADB: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
SRPT: వల్లూరి ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు నేషనల్ ప్రతిభ నోబెల్ అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వల్లూరి ఫౌండేషన్ ఛైర్మన్ వల్లూరి శ్రీనివాస్ అందజేశారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువుకు గోదావరి ఎల్లంపల్లి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, పీసీసీ సభ్యులు గడ్డం శ్రీనివాస్, దయ్యాల శీను తదితరులు కాల్వను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా కాలం తర్వాత సాగునీరు విడుదల కావడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.
PDPL: రామగుండం పట్టణాన్ని క్లిన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా హ్యాపీ సండే నిర్వహించారు. గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద క్లీన్ చేసి, నది తీరంలో ఉన్న చెత్త, ప్లాస్టిక్‌ను తొలిగించారు. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పాల్గొన్నారు.
NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ నందు ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా మున్సిపల్ సిబ్బందికి హెల్త్ చెకప్ చేసి సరైన మందులు ఇవ్వడం జరిగింది. కార్య క్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ ఛైర్మన్ రహీం పాషా, కౌన్సిలర్స్ శేఖర్, బోరెల్లి మహేశ్ పాల్గొన్నారు.
KNR: గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ పట్నాల ఉత్సవాలు చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మహిళలు పోచమ్మ బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లు, శివ సత్తుల పునకాలతో ఊరేగింపుగా వెళ్లారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
NGKL: జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
MBNR: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, TCS ION ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్” విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని EMRRC డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ తెలిపారు. ఎంవీఎస్ (MVS ) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ కింద మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నేడు 23వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించి, పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. నేటి తనిఖీలే రేపటి మెరుగైన ఖమ్మానికి పునాది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
RR: శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్‌ఎస్ నేత మారబోయిన రవి యాదవ్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఈ హాల్.. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ధ్వంసమైన విద్యుత్ పరికరాలు, అపరిశుభ్రతతో నిరుపయోగంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
NGKL: తాడూర్ మండలం తుమ్మలసూగురు గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన శ్రీ వీర నాగమ్మ, ఎల్లమ్మ దేవతల పండుగ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, శాంతి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.
NRML: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులను నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలలకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.
ADB: వినియోగదారుల చట్టాలపై అవగాహనతోనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. పట్టణంలోని చాందా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరైన ఆధారాలతో జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని శామ్యూల్ కోరారు.