MDCL: అల్వాల్ పరిధిలోని తుర్కపల్లి డివిజన్ (190) శివాంభావి వద్ద ఓపెన్ నాలా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.20 లక్షల వ్యయంతో సంజీవ రెడ్డి గార్డెన్స్ నుంచి శివాంభావి వరకు ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సీసీ స్లాబ్‌లు, అల్యూమినియం మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, స్థానిక కాలనీ నాయకులు పాల్గొన్నారు.
MNCL: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా మహిళలు తమ హక్కులపై చట్టసభల్లో గళం విప్పే అవకాశం ఉంటుందని తెలిపారు.
VKB: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వినయ్ కుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన రాజీనామ లేఖలో కారణాలను వివరించారు. అయితే ఆసుపత్రిలో నిర్వహణ, పర్యవేక్షణ కోసం కొందరు వైద్యులు తనకు సహాకారం అందించడం లేదని డా.వినయ్ లేఖలో పేర్కొనడం గమనార్హం.
PDPL: పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయిందని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. 380 మంది అభ్యర్థులు పాల్గొనగా 62 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, మరో 9 మంది షార్ట్ లిస్టు అయినట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
SRCL: రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరును యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తున్నామని శుక్రవారం రాజన్న సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణు మాధవ్ తెలిపారు. కేవలం 17 రోజుల్లోనే 541 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేయడం విశేషమన్నారు. ఇది శాఖ పనితీరుకు, రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
GDWL: కృష్ణానది తీరాన చారిత్రక ప్రాభవంతో విరాజిల్లుతున్న ప్రాగుటూరు రాతి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నడిగడ్డ ప్రజలు కోరుతున్నారు. సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కోటలో రాజ దర్బారు, ఆలయాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శిథిలావస్థకు చేరుతున్న ఈ కట్టడాలకు పురావస్తు శాఖ మరమ్మతులు చేపట్టి, వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద దారిచూపే బోర్డులను జాతీయ రహదారి అధికారులు తాజాగా సవరించారు. గతంలో ఇవి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొత్తగా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ బోర్డులు స్పష్టంగా ఉండటంతో తిరుమలగిరి వెళ్లే ప్రజలకు ప్రయాణం సులభతరమైంది.
SRPT: రహదారి భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. జిల్లాలో 45 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై గ్రామాల్లో తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రాణం విలువైనదని, రోడ్డు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని ఆయన సూచించారు.
VKB: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండో పీఆర్సీని అమలు చేయడంతో పాటు పెండింగ్‌లోని డీఏ, డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలని టీజీ ఈజేసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేయొద్దు అన్నారు.
WNP: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఈనెల 18 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు 45 ఏళ్లలోపు ఉండి సంబంధిత టీటీసీ కోర్సులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులు కావాలన్నారు. మే 1 నుంచి 11 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
MDK: చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎస్సై చైతన్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
MBNR: ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ, పీఆర్టీయూ టీఎస్, టపాస్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కౌకుంట్ల తహశీల్దార్ సుందర్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు చేయాలని,పెండింగ్ బిల్లులు విడుదల చేసి, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేసి, ఈహెచ్ఎస్ అమలు చేయాలని నేతలు కోరారు.
BDK: TGE JAC ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TSTTF జిల్లా అధ్యక్షుడు మోహన్ పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగ,ఉపాధ్యాయులకు రావలసినటువంటి పిఆర్సి,పెండింగ్ డీఏలు, సిపిఎస్ రద్దు, ఓ పీ ఎస్ అమలు, హెల్త్ కార్డులు, వివిధ రకాల 64 సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు KCR ఎవరినీ ప్రకటించలేదని, మాజీ MLA తాటికొండ రాజయ్యకు అధిష్టానం నుంచి ఎలాంటి లెటర్ ఇవ్వలేదని BRS జిల్లా నాయకులు రాకేష్ యాదగిరి, సుదర్శన్ తీవ్రంగా విమర్శించారు. ఇవాళ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే చిల్లర రాజకీయాలు సహించేది లేదని హెచ్చరించారు.
PDPL: రామగిరి మండలం రాజాపూర్ ఆదివారం పేట గ్రామాలలో కరీంనగర్ గణాంక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించారు. మొదటి విడతలో ఎంపిక చేసిన పట్టణాలు గ్రామాలలో ప్రజల ఉపాధి స్థితిగతుల వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. కుటుంబ యజమాని, సభ్యులు, విద్యార్హతలు, ఆదాయము, పనిచేసే గంటలు మొదలైన వివరాలు సేకరించారు.