MDCL: బోడుప్పల్ పరిధి వెంకటేశ్వర నగర్, ప్రధాన రహదారి దుకాణాల్లో కోడిగుడ్ల ధరలు మరింత తగ్గుముఖం పట్టినట్లు అక్కడ వ్యాపారులు తెలిపారు. హోల్ సేల్ వ్యాపారులు డైరెక్ట్ వివిధ వాహనాలలో వచ్చి 30 గుడ్లు కేవలం రూ.70లకే విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లి కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రానికి చెందిన విశ్రాంత కార్యాలయ సహాయకులు (ఆఫీసు సబార్డినేట్) నరసింహా ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల స్థానిక ప్రముఖులు, తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. నరసింహారావు తన సుదీర్ఘ సర్వీసులో నిజాయితీ గల వ్యక్తిగా గుర్తింపు పొందారని వారు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
BHNG: యాదగిరిగుట్ట మండలంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పర్యటించారు. సైదాపూర్ గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని నివాసానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే సైదపురం చెరువు నుంచి అలుగు పారుతుండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NZB: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద బోధన్ నియోజకవర్గానికి రూ.3.5 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే చొరవతో బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, సాలూర మండలాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
RR: శ్రీరామనవమి సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయంలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా దేవాలయ ఈవో లావణ్య అధికారిక ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు.
HNK: మాతృత్వం ఒక వరమని, దానికి చట్టబద్ధమైన దత్తత మార్గమే శ్రేయస్కరమని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత విభాగాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికైన శిశువును వడ్డేపల్లికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు. చిన్నారిని ఎత్తుకొని ఆడించారు.
NLG: అక్రమ శిశు విక్రయాలపై ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాలతో త్రిపురారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్ఐ నరేష్ వర్మ నేతృత్వంలో 24 గంటల్లోనే కేసును ఛేదించి, పసికందును సురక్షితంగా రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, శిశువును నల్లగొండ సంక్షేమ కేంద్రానికి తరలించారు. సత్వరమే స్పందించిన పోలీసులకు పలువురు అభినందనలు తెలిపారు.
VKB: బంటారంలోని నవోదయ పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థులు 12మంది గురుకులాలకు ఎంపికయ్యారు. ఇటీవల వెలువడ్డ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలలో వారు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బాల బ్రహ్మం చారి తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు గురుకులాలకు ఎంపికకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
MDCL: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌పై వరుస వార్తా కథనాలు వెలువడటంతో అధికారులు కదిలారు. తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు గంగుల సరిత స్వయంగా రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి కాలుష్యం, దుర్వాసన మధ్య నివసిస్తున్న ప్రజల సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.
HYD: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన డాక్టర్ బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌ను డ్రగ్స్ పార్టీలకు వేదికగా వాడుకున్నట్లు గుర్తించారు. పెడ్లర్ రాకేష్ వర్మ నుంచి డాక్టర్ బాలాజీకి MDMA డ్రగ్స్ అందినట్లు ఆధారాలు లభించాయి.
NZB: సిరికొండ మండలం గడ్కోల్ రైతు వేదికలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గురువారం శిక్షణ నిర్వహించారు. లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులపై ట్రైనర్లు బాలకృష్ణ, నరేశ్, నగేశ్ అవగాహన కల్పించారు. అయితే మొత్తం 88 మంది వార్డు సభ్యులకు గాను కేవలం 19 మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం. ప్రజాప్రతినిధుల గైర్హాజరీపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రానికి టీజీ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంపై సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రాజ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ పాఠశాలను కేటాయించారని కొనియాడారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి రానుందని వారు పేర్కొన్నారు.
PDPL: గ్రామాలలో 100% పన్ను వసూలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాల సైతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
JGL: ఎండపల్లి మండలంలోని గుల్లకోట ప్రాథమిక పాఠశాలకు దాత బుర్ర విజయ్ రూ.10వేల విలువైన బీరువాను అందించారు. పాఠశాల కార్యాలయ రికార్డులు, విద్యార్థుల బోధనాభ్యసన పత్రాలను భద్రపరచేందుకు తన తండ్రి కీ.శే.బుర్ర శంకరయ్య జ్ఞాపకార్థం ఈ సహాయం అందించినట్లు దాత తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి, ఉపాధ్యాయులు దాతను శాలువాతో సన్మానించారు.
MDCL: మేడ్చల్లో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముకుంద థియేటర్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ సమీపంలో ఉన్న ఈ మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు, పాదచారులకు ఇది పెద్ద ముప్పుగా మారిందని, వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.