WNP: మండల కేంద్రంలో ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలు లేక రైతులు కష్టాలు పడుతున్నారు. రబీలో ధాన్యం 17శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారని కానీ ఆరబెట్టడానికి స్థలాలు లేవని రైతులు వాపోయారు. వనపర్తి పట్టణం కాశీంనగర్ రోడ్డు, తాళ్ల చెరువు వెనుక ఇంటర్నల్ రోడ్లపై, తాళ్ల చెరువు కట్టపై ధాన్యం ఆరబెడుతున్నారు.
SRD: ఖేడ్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నేడు రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించారు. జూకల్ రైతు వేదికలో కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఇందులో ప్రధానంగా ఉద్యాన వన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారి మౌనిక రెడ్డి తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాంకేతిక సమాచారాన్ని సైంటిస్ట్ శైలజ రైతులకు సూక్ష్మంగా వివరించారు. ఇందులో HEO విట్టల్ ఉన్నారు.
SDPT: వేసవిలో గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మగ్ధూంపూర్ సర్పంచ్ పాకాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జరిగిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని సమృద్ధిగా సరఫరా చేస్తామన్నారు. అలాగే, గ్రామంలోని ప్రతి వీధి దీపం వెలిగేలా చూడాలని, చెడిపోయిన వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు.
NRML: ఖానాపూర్ మండల కేంద్రంలోని J.K ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రైతు వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర గీతాలాపన చేశారు. అధికారులు, రైతులకు పంటల సాగు పైన దిశనిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు కృషి చేయాలని, ప్రభుత్వం ద్వారా అందుతున్న సబ్సిడీ రుణాలను ఉపయోగించుకోవాలన్నారు.
KNR: సైదాపూర్ మండలంలో ఉండాల్సిన ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం కరీంనగర్ లో ఉండటంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. సాగునీటి సమస్యలు, కాల్వల మరమ్మతులపై ఫిర్యాదు చేయాలంటే అధికారులు కనిపించక, కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ జాప్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, మండలంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
VKB: సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 8న కొడంగల్‌కు రానున్నట్లు అధికారులు తెలిపారు. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఇళ్లను తొలగించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ADB: ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలను అందజేశారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన నాలుగు లక్షల రూపాయల LOCని వారి కుటుంబ సభ్యులకు ఎంపీ కడియం కావ్య అందజేశారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని 4వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పెంబుల దుర్గా భవాని (17) అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ సెక్షన్ 137(2) కింద ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
HYD: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి శంషాబాద్ హార్డ్‌వేర్ పార్కులో రూ.453 కోట్లతో ITP Aero ప్లాంట్‌కు మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. 10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌లో విమాన ఇంజన్ల కీలక భాగాలు తయారవుతాయి. 2027 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 600 మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి లభించనుంది. రాష్ట్ర ఏరోస్పేస్ రంగానికి ఇది మరో మైలురాయి.
PDPL: ఓదెల మండలం కొలనూర్ రైతు వేదికలో మంగళవారం “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక”లో భాగంగా రైతు వారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా PJTAU శాస్త్రవేత్తలు డా. తిరుపతి, డా.రాణి ఆధునిక సాగు, సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పించారు. సిఫారసు చేసిన వరి రకాల సాగుతో లాభాలు పెరుగుతాయని సూచించారు. భూసార పరీక్షలు, ఎరువుల సమతుల వినియోగాన్ని వివరించారు.
MNCL: మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మంగళవారం ఈ 12న హైదరాబాద్‌లోని జల విహార్‌లో జరగనున్న తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎండీ సిరాజ్, బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్లీనరీలో భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు.
MHBD: కొత్తగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చొప్పరి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కమిటీ ఆయన నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన మంత్రి సీతక్క, రాష్ట్ర, జిల్లా నాయకులకు కుమార్ ఇవాళ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తానన్నారు.
KMM: హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని పీఏసీఎస్ ఛైర్మన్లు ఇవాళ తిరిగి తమ పదవులను చేపట్టారు. పైనంపల్లిలో డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావుతో పాటు పలువురు ఛైర్మన్లు విధుల్లో చేరారు. న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా, మరింత ఉత్సాహంతో సేవలు అందిస్తామని వారు స్పష్టం చేశారు.
WGL: కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అంత్య పుష్కరాలకు రూ.30కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.198కోట్లు కేటాయించిందని తెలిపారు.