SRD: కోహిర్-జహీరాబాద్ రైల్వే మార్గంలో 35-40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వద్ద సదాశివపేట ‘సాయిరాం షాపింగ్ మాల్’ సంచి ఉంది. లోకో పైలట్ సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు 77026 29707 నంబర్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పూర్తి వావరాలు తెలియాల్సి ఉంది.
ADB: పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలన్నారు.
SRD: కానిస్టేబుల్ మందారిక హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కానిస్టేబుల్ జాల ప్రకాష్‌కు సంగారెడ్డి కోర్టు మరో ఆరేళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానా విధించింది. ప్రకాశ్ 2014లో SRD మహిళా ఠాణాలో పనిచేస్తూ కానిస్టేబుల్ మందారికను ప్రేమ పేరిట వేధించారు. తట్టుకోలేక ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మందారిక ఫిర్యాదు మేరకు కోర్టు మరో 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
KNR: వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట శివారులోని అక్రమ తవ్వకాలతో కర్షల్ గుట్ట కరిగిపోతోంది. ఓ రైస్మిల్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో 3 రోజులుగా మట్టి తరలించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 ట్రిప్పుల మట్టిని తరలించారని సమాచారం. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.
NZB: కమ్మర్ పల్లి మండలం వేసవి దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజిఎస్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
NZB: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుళ్లి పోయిన చికెన్, మాంసంతో తయారు చేసిన ఫుడ్‌ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆకలేసి సుష్టుగా బిర్యానీ తిందామని ఏదైనా హోటల్‌కు వెళితే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే, నగరంలోని చిన్న, పెద్ద హోటల్స్ అనే తేడా లేకుండా కుళ్లిపోయిన బిర్యానీ వండి పెడుతున్నారు.
NLG: చండూరులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు లైన్మెన్ షరీఫ్ పాషా తెలిపారు. శ్రీ మార్కండేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మునుగోడు రోడ్, మున్సిపల్ ఆఫీస్, కనకదుర్గమ్మ గుడి, ఆయిల్ మిల్ రోడ్ ప్రాంతాల్లో కోత ఉంటుందని వివరించారు. భక్తుల రక్షణ, రథోత్సవ నిర్వహణ దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
MDCL: హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధి తిరుమల నగర్‌లో ఉన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. 27వ తేదీన మైలపోలు కార్యక్రమం నిర్వహించనుండగా, 28వ తేదీన గంగపూజ, స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలిపారు.
MDCL: ఘట్‌కేసర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ నివాసమూర్తి తెలిపారు. ప్రస్తుత పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, మే 2026 చివరి నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. వంతెన పూర్తయితే రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.
KMR: తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మెహర్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో బాబా చిత్రపటంతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మందిరంలో కేక్ కట్ చేసి, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరిపారు.
RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు సమయానికి చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయగా..పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
PDPL: సుల్తానాబాద్‌లో మంగళవారం 99మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా వంటి పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు.
MNCL: మంచిర్యాలకు చెందిన బోడ ధర్మేందర్‌కు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అత్యున్నత పురస్కారం వరించింది. ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు మంగళవారం రాత్రి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ధర్మేందర్‌ను బ్యాంకు అధికారులు అభినందించారు.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,100గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.100 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
ASF: కెరమెరి మండలం గోయగాం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చిన ఓ కొండగొర్రెపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు దానిని రక్షించినప్పటికీ, తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. FRO యోగేశ్ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు. అటవీ శాఖ అధికారులు వెంకట్, నజీర్ అలీ పాల్గొన్నారు.