MDK: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన బ్యాగరి రాకేశ్ జాతీయ స్థాయి కెమిస్ట్రీ పోటీ పరీక్షలో 98వ ర్యాంక్ సాధించి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్యాట సరిత ఆయనను సన్మానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
SDPT: అక్కన్నపేట మండలం మల్చేరుతండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ గుగులోతు మహేందర్ నాయక్, వార్డు సభ్యులు రజిత సంపత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నాణ్యతగా కూలీల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కొనసాగించాలని తెలిపారు.
KMM: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి వారికి తక్షణమే న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూములను కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.
JGL: జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి1న ఉదయం 10-1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామన్నారు.
ADB: కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన ఆయనకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సాగర స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
SDPT: అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట నుంచి చిన్నగుడిపాడు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. చేతికందే ఎత్తులో తీగలు వేలాడుతుండటంతో స్థానికులు కర్రను స్తంభంగా ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఆపుతున్నారు. పగలు, రాత్రి రైతులు, ప్రయాణికులు తిరిగే ఈ దారిలో గాలివానకు కర్ర కూలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎన్టీ హాస్టల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దాని పర్యవసానాలు’ అనే అంశంపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
JGL: రూరల్ మండలం రఘురాములకోట గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
HNK: ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేడు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని, ఒత్తిడిని వదిలి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.
NLG: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో పశు వైద్య, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సురేందర్, యమునా ఆధ్వర్యంలో 21 గేదెలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొని పశుపోషకులకు అవగాహన కల్పించారు.
MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు చరిత, మాధవి, ప్రవీణ్ పాల్గొన్నారు.
ADB: గర్భిణీ, బాలింత, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని HEO పవార్ రవీందర్ అన్నారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సంతోష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
SRPT: నడిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఆరుగురు విద్యార్థులు డుమ్మా కొట్టారు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ, వాణి పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
SRPT: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామ పంచాయతీలో పొదుపు మహిళా బృంద సమావేశ మందిర (VO బిల్డింగ్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ మరోజు పార్వతమ్మ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.
JGL: జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్ సమిండ్ల వాణిపై అభిమానాన్ని ఓ వడ్రంగి వినూత్నంగా చాటుకున్నారు. సంగంపల్లికి చెందిన గుగ్గిళ్ల వెంకటేశ్ రెండు రోజుల పాటు శ్రమించి, టేకు కర్రపై ఆమె పేరును అందంగా చెక్కారు. గురువారం ఆ ప్రత్యేక నేమ్ ప్లేట్‌ను ఛైర్ పర్సన్‌ను బహూకరించారు. వృత్తిపై మక్కువతో ఆయన చేసిన ఈ పనిని సమిండ్ల వాణి అభినందించారు.