JN: క్షయ వ్యాధి నిర్మూలనకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఇవాళ కలెక్టరేట్లో సంబధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాధి నిర్మూలన విషయంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన పరచాలని సూచించారు.
ములుగు జిల్లాలో పామాయిల్ సాగు పెంపు కోసం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఆత్మ ఛైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రాలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 శాతం రాయితీపై కూరగాయ విత్తనాలు, ఆక్వా యూనిట్లకు ఎస్సీ, ఎస్టీలకు 60%, ఇతరులకు 40% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. త్వరలో కిసాన్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోన లొటారం, పైన పటారంగా ఉందని MLA పాయల్ శంకర్ అన్నారు. రైతు భరోసా నిధులకు సరైన కేటాయింపులు లేకుండా ఈ బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెట్టారని విమర్శించారు. ఉద్యోగులు తమ కష్టపడి జమ చేసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం అని MLA పేర్కొన్నారు.
మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 3, 5 వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్, ఐడెంటి కార్డు, ఫీజు చెల్లించిన రసీదులు తీసుకురావాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
KNR: జిల్లా కేంద్రంలో ఇవాళ భగవతి పాఠశాలలు, సమైక్య సాహితి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డా. డింగరి నరహరి ఆచార్య రచించిన ‘మథనం’, ‘ఉజ్జీవనం’ పుస్తకాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. అనంతరం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి సునీల్ రావును భగవతి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.
SRCL: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని సాయి నగర్‌లో మార్చి 17, 2026న మెరుగు లత తన ఇంటి నుంచి బయటకు రాగా సయ్యద్ మౌలానా, మంగురు ప్రకాష్ యాదవ్ అడ్రస్ అడుగుతున్నట్లు నటించి బాధితురాలి పుస్తెలతాడు తెంపుకెళ్లినట్లు పేర్కొన్నారు.
JGL: పర్యావరణ పరిరక్షణతోనే గ్రామానికి పచ్చని భవిష్యత్తు ఉంటుందని రాయికల్ మండలం ఇటిక్యాల యువత నిరూపించారు. గ్రామంలో నిర్మిస్తున్న గంగాదేవి ఆలయానికి ఓ యూత్ సభ్యులు తమ సామాజిక బాధ్యతగా రూ.12,222 ఆర్థిక సాయం అందజేశారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటాలని వారు నిర్ణయించారు.
RR: ప్రజల అవసరాలే మా మొదటి ప్రాధాన్యత అని నందిగామ మండలం చేగూరు సర్పంచ్ శ్రీశైలం అన్నారు. గ్రామంలోని 4,5,8 వార్డుల్లో శాశ్వత బోర్లను ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డుల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని బోర్లను వేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు గ్రామానికి ఎంతో అవసరమని అన్నారు.
MDCL: అల్వాల్ పట్టణ పరిధి టెంపుల్ అల్వాల్ హరిదాస మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ సీతాష్టోత్తర శతనామ కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. శనివారం సాయంత్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఉంటుందని తెలిపారు.
SRPT: యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త హరిబాబును కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇవాళ సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. అదనపు కట్నం కోసం గర్భిణీని చిత్రహింసలు పెట్టి చంపడం దారుణమని, నిందితుడికి బెయిల్ రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి రేణుక కోరారు.
MDK: రంజాన్ పండుగ పురస్కరించుకొని పెద్ద శంకరంపేట ఈద్గా వద్ద శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఈద్గా వద్ద తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఏఎస్ఐ సంగమేశ్వర్, జిల్లా బాంబు స్కాట్ బృందం, పోలీస్ సిబ్బంది, మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో త్రాగునీటి శుద్ధి కేంద్రంను ఇవాళ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోరిన వెంటనే RO ప్లాంట్, హైమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
RR: గాలిగూడ గ్రామపంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చౌదరి గూడ మండలం గాలిగూడ గ్రామ సర్పంచ్ స్వప్న సత్యం, ఉపసర్పంచ్ బలరాం, తదితరులు కాంగ్రెస్‌లోకి చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.
HYD: బడ్జెట్‌లో హైదరాబాద్ నగరానికి సున్నా నిధులు కేటాయించడం బాధకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. గత ఏడాది బడ్జెటు ఈ బడ్జెట్‌కు పెద్ద తేడాలేదని విమర్శించారు. GHMCని మూడు ముక్కలుగా విడగొట్టారని మండిపడ్డారు. అసలు నిధులు కేటాయించకపోతే.. HYD అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యాశాఖకు 8 శాతం నిధులే కేటాయించారని ధ్వజమెత్తారు.
BHNG: జీతాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. నిరసనకారుల న్యాయమైన కోరికను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.