SRPT: పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిపోయాయని, పాఠశాలలకు ఒంటిపుటబడులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలవలు, చెరువులు, బావులకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు.
ADB: రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తమ శనగ పంటను అమ్ముకోవాలని ఆత్మ కమిటీ ఛైర్మన్ గిమ్మ సంతోష్ రావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. రైతులు తమ పంటను ఆరబెట్టి, తేమ శాతం లేకుండా తీసుకువచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు.
WNP: రేవల్లి, ఏదుల మండలాలలో నూతనంగా నిర్మించిన భవనాలలోకి తహసీల్దార్ కార్యాలయాలను తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆయా మండలాలలో ప్రారంభత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, సౌకర్యాలు ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సోప్ ఫిట్ నిర్మాణ పనులను జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య పరిశీలించారు. ఎంపీడీవో సతీష్, సర్పంచ్ వెంకటేష్‌లతో కలిసి పాఠశాలను సందర్శించారు. కమ్యూనిటీ సోప్ ఫిట్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్, వార్డు సభ్యులు ఉన్నారు.
HYD: మే 4వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి మే 21 వరకు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రం నుంచి మొత్తం 11,757 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతానికి 9,500 మందికి అనుమతి లభించినట్లు అధికారులు వెల్లడించారు.
WGL: 2022-23 బ్యాచ్‌కు చెందిన శరదృతి, ముత్తినేని అంకిత 2025 నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందారు. శరదృతి కాకతీయ మెడికల్ కాలేజీ, అంకిత ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రవేశం పొందారు. ఈ మేరకు ఇవాళ పాఠశాల డైరెక్టర్ జావేద్ విద్యార్థులను సన్మానించి అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యలో రాణించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
MHBD: తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పేరుకు మాత్రమే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ.. లోపల మాత్రం దర్జాగా మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా షాపులు తెరిచి ఉండడంతో మద్యం తాగి యువకులు, పెద్దలు గొడవలకు దిగుతున్నారు. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
NLG: కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా నకిరేకల్ ప్రాంతానికి తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగుతోంది. దీనిని అడ్డుకున్న స్థానికులపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KMM: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 23 దేశవ్యాప్తంగా జాతీయోద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో నాయకులు ఇవాళ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వలసవాద ధోరణిని మార్చుకోవాలని అన్నారు. ఈ నెల 23న జరగనున్న కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిన్నాన్న సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించారు. శుక్రవారం వలిగొండ పట్టణంలో ఆయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని దుఃఖ సంద్రంలో మునిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నరు.
JN: క్షయ వ్యాధి నిర్మూలనకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఇవాళ కలెక్టరేట్లో సంబధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాధి నిర్మూలన విషయంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన పరచాలని సూచించారు.
ములుగు జిల్లాలో పామాయిల్ సాగు పెంపు కోసం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఆత్మ ఛైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రాలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 శాతం రాయితీపై కూరగాయ విత్తనాలు, ఆక్వా యూనిట్లకు ఎస్సీ, ఎస్టీలకు 60%, ఇతరులకు 40% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. త్వరలో కిసాన్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోన లొటారం, పైన పటారంగా ఉందని MLA పాయల్ శంకర్ అన్నారు. రైతు భరోసా నిధులకు సరైన కేటాయింపులు లేకుండా ఈ బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెట్టారని విమర్శించారు. ఉద్యోగులు తమ కష్టపడి జమ చేసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం అని MLA పేర్కొన్నారు.
మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 3, 5 వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్, ఐడెంటి కార్డు, ఫీజు చెల్లించిన రసీదులు తీసుకురావాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
KNR: జిల్లా కేంద్రంలో ఇవాళ భగవతి పాఠశాలలు, సమైక్య సాహితి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డా. డింగరి నరహరి ఆచార్య రచించిన ‘మథనం’, ‘ఉజ్జీవనం’ పుస్తకాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. అనంతరం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి సునీల్ రావును భగవతి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.