BHNG: జిల్లాలోని తుర్కపల్లి మండలం కొండాపురంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప సర్పంచ్ జహంగీర్, వార్డ్ సభ్యులు స్వప్న, మధు, రవికిరణ్, పాండు పాల్గొన్నారు.
NRPT: మరికల్ మండలంలో భారతదేశపు అతిపెద్ద క్రీడా వేడుకగా భావించే భారత ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చి 24వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది రోడ్లన్నీ శుభ్రం చేశారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలు తెలుసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సూచించారు.
NRML: ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను గురువారం స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు జబర్దస్త్ టీం సభ్యులు హాజరవుతున్నారని ఉగాది పచ్చడి వితరణ, పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బుధవారం పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.
SRPT: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం – శ్రీరంగాపురం మధ్య మెటల్ రోడ్డు గుంతలు పడి, ఇరువైపులా కంపచెట్లతో అధ్వానంగా మారింది. దీంతో ఆయకట్టు రైతులు, పాదాచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని, మరమ్మతులు చేపట్టి, తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్‌గా తన చిన్ననాటి మిత్రుడు సాగర్ల భానుశ్రీ భిక్షం ఎన్నికైన సందర్భంగా..1998 టెన్త్ బ్యాచ్‌కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ గుత్తా శ్రీధర్ రెడ్డి, పిశాటి జంగారెడ్డి తమ స్నేహాన్ని చాటుకున్నారు. రూ.60 వేల విలువైన నూతన ఫర్నిచర్‌ను గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశారు. ఈ ఉదారతకు సర్పంచ్ భానుశ్రీ భిక్షం కృతజ్ఞతలు తెలిపారు.
NGKL: వెల్దండ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 75 ఇండ్ల గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని.. ఈ సమావేశానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.
BHNG: జిల్లాలో గోదాముల సదుపాయాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గోదాముల నిర్మాణానికి ఆమోదం లభించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రీన్ స్టోరేజ్ స్కీమ్ ద్వారా సహకార సంఘాలకు గోదాములు నిర్మించనున్నారు.
WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని MSC ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు. ఈనెల 18న జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సకాలంలో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
MHBD: కొత్తగూడెం మండలం బూరుగు గుంపు గ్రామానికి చెందిన మల్లెల అశ్విని- మహేష్ దంపతుల మూడు నెలల కూతురు ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాలతో పోరాడుతుంది. ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ తన వంతు సహాయంగా రూ. 4,000 నగదును ఆ కుటుంబానికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
MNCL: మంచిర్యాల 27వ డివిజన్‌లోని గాంధీనగర్‌లో మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్యకు వివరించగా.. వారు మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. పనులు పూర్తవగానే ప్రతి ఇంటికి సక్రమంగా మంచినీరు సరఫరా చేయనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.
NLG: హాలియాలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్—నాన్ వెజ్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక సదుపాయాలతో ఒకేచోట మార్కెట్ ఏర్పాటు లక్ష్యంగా పనులు ప్రారంభించినా ఆలస్యం అవుతోంది. మార్కెట్ పూర్తి కాకపోవడంతో వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం కొనసాగిస్తున్నారు.
SRPT: రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ తోఫా కానుకలను నడిగూడెం మండలం వల్లాపురంలో ఇవాళ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు తోఫా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కానుకలను అందిస్తోందని తెలిపారు.
SRCL: ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించాలని లక్ష్యంతో పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో “నైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని ప్రారంభించారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక భారంగా మారకూడదని ప్రవేశపెట్టామన్నారు.
ASF: కమన గ్రామానికి చెందిన సందీప్ కుమార్ వాంకిడి ఎస్సై మహేందర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూ సమస్యపై ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే ఎస్సై దుర్భాషలాడారని, శారీరక దాడికి పాల్పడ్డారని బుధవారం పేర్కొన్నారు. అస్వస్థతతో ఉన్న తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వాపోయారు. ఈ మేరకు జిల్లా SPని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు.