ASF: కాగజ్ నగర్ మండలం మండువ చెరువు నుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న 2 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. MRO మధుకర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి, వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించి ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని MRO హెచ్చరించారు.
TPT: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హరిత విప్లవానికి తోడ్పడిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబు జగజ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం TTD ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొని నివాళులర్పించనున్నారు.
JGL: జగిత్యాల పట్టణంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కీలకమని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు రూ. 500 కోట్లు సరిపోతాయని తెలిపారు. ప్రాణహిత జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
ATP: కూడేరులో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి తేరు వేడుక కనులపండువగా జరిగింది. ఈ రథోత్సవానికి అనంతపురం జిల్లా నుంచి నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి రథం గ్రామంలో వైభవంగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
WNP: ప్రజా ప్రభుత్వ లక్ష్యం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను చేరవేయడమేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరిస్తూ, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
AP: ఇరిగేషన్ శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో చేపట్టాల్సిన పనుల అంచనాల రూపకల్పనలో ఆలస్యంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విఫలమైన సీఈలు సోమవారం స్వయంగా వివరణ ఇవ్వాలన్నారు.
ADB: మాజీ ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఏనుగు శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిగా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఈ మేరకు రాష్ట్ర స్థాయి డైరెక్టర్‌గా ఎదగడంపై పలువురు అభినందనలు తెలిపారు.
MDCL: గ్యాస్ కొరత లేదని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ ప్రభావం ఉన్నట్లు ఉప్పల్ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు రాకపోవడంతో, హోటల్స్ వ్యాపారం నడిపించలేక కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని రోజుల వరకు బ్లాక్ రేట్లకు కొనుగోలు చేసిన వ్యాపారులు, చివరికి భరించలేక, హోటల్స్ మూత పెట్టుకున్నారు.
హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో దొడ్డి కొమురయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి రిజిస్ట్రార్ రామచంద్రం, పాలకమండలి సభ్యుడు రాజు గౌడ్, అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రాణాలను అర్పించిన మహావీరుడు దొడ్డి కొమురయ్య అని రాజు గౌడ్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘T20 WCకు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్ బ్యాక్ చేయాలనే ఆలోచన ఉండేది. దీనిపై మార్‌క్రమ్‌తో కూడా మాట్లాడాను. కానీ, ప్రస్తుతం నాకు నా కుటుంబంతో గడపడమే ముఖ్యం. అందుకే నేను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం లేదు’ అని వ్యాఖ్యానించాడు.
నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జనసేన నగర కార్యాలయాన్ని ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ONUDA) ఛైర్మన్ షేక్ రియాజ్ సందర్శించారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించిన రియాజ్.. నెల్లూరులో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసిన జనసైనికులను అభినందించారు.
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లితండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 123వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లకు ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
GDWL: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సిరాజ్ అన్నారు. మానవపాడు మండలం మద్దూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
MBNR: మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మర్లు ప్రాంతంలో ఓ నూతన పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
ELR: పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కోడూరుపాడులో శుక్రవారం ఆరోగ్య విస్తరణ అధికారి వై.వి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. “ఫ్రైడే-డ్రైడే” కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నిల్వ నీటిని తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.