KRNL: జిల్లా పర్యటనలో భాగంగా, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ తుల్జాపూర్ స్వప్న ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామంలోని “శ్రీ బసవేశ్వర కళ్యాణ మండపం” నిర్మాణానికి ఇవాళ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తాలుకా “వీరశైవ లింగాయత్ సంక్షేమ సేవా సమితి” కమ్యూనిటీ వ్యవస్థాకాధ్యక్షులు బిసి.నాగరాజు అధ్యక్షత వహించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి దేవస్థానంలో ఆదివారం సెలవు దినం పురస్కరించుకొని భక్తుల రద్దీ జరిగింది. గర్భాలయం, విష్ణు పుష్కరిణి, ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, శీఘ్ర దర్శనం తదితర దేవాలయ ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్‌లో బారులు తీరారు.
MDK: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారి నీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
అన్నమయ్య: అంగన్వాడీల వేతనాలను రెండుసార్లు పెంచామని, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినా, CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
KRNL: ఆలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా, అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన 12 వాహనాలను ఈ నెల 4న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ లలితాదేవి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సెబ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.5 వేలు చెల్లించి పాల్గొనవచ్చని సీఐ పేర్కొన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను తొలిసారిగా చిన్న జీయర్ స్వామి సందర్శించారు. నుస్తులాపూర్ క్రాసింగ్ వద్ద భక్తులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలోని శబరిమాత ఆశ్రమ భక్తుల కోరిక మేరకు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించి, షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నిర్మాణ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, గంగమల్లు, తదితరులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో పైడ్‌లైన్ పనులకు రూ.80 లక్షలు మంజూరు చేసినందుకు రాష్ట్ర కురవ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కర్నూలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తై గ్రామానికి నీటి సరఫరా ప్రారంభమైందని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా ఎస్ఎస్ ట్యాంకుల మరమ్మతుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.
BHPL: చిట్యాల(M) బౌసింగ్ పల్లికి చెందిన అక్క-తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపారు. దెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య TG నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలిచింది. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా వ్యాప్తంగా వీరి విజయాన్ని ప్రశంసిస్తున్నారు.
W.G: భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
TG: గల్ఫ్ దేశాల్లో తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంబసీ జారీ చేసే మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. భారత ఎంబసీలతో అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని వెల్లడించారు.
AKP: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామ సర్పంచ్ సఖిలేటి రాము(62) అనారోగ్యంతో కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. జనవరి నెలలో గుండెకు స్టంట్ వేసిన నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పత్తికుంట వారిపల్లి గ్రామానికి చెందిన రాఘవ నరసరాజు పొలంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. టీడీపీ ఇంచార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్యరాలు పద్మశ్రీ మత ప్రచారం నిర్వహిస్తున్నారన్న విషయంపై విచారణ చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి నివేదిక అనంతరం వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆయుష్) అధికారులకు నివేదిక పంపుతామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన 98 మంది రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, కల్టివేటర్లు వంటి పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.