KRNL: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు.
కోనసీమ: రామచంద్రపురం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. శుక్రవారం అమరావతిలో పవన్ కళ్యాణ్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.
AP: రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. ‘ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారు. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం’ అని సీఎం వెల్లడించారు.
ఎన్టీఆర్: మైలవరం పట్టణం పరిధిలోని దేవుని చెరువులో శుక్రవారం 11వ సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు, కూటమి నాయకులతో కలిసి తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ ఈ పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కాళ్ళుగా పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.
PPM: గిరిజన పీజీఆర్ఎస్‌తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్‌లో గిరిజనుల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ.. మహిళల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించడానికి ఇక్కడ కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
JGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్ద పారిశుద్ధ్య పనులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ వాణి శ్రీనివాస్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా.. తన ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హోలోయూఐ, 6.78 అంగుళాల సూపర్ HD 1.5K అమోలెడ్ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50 MP+13 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 7000mah బ్యాటరీతో వస్తుంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది.
కృష్ణా: బాపులపాడులో ప్రధాన డ్రైనేజీలు పూడికతో నిండిపోవడంతో మురుగు ప్రవహించకుండా దుర్గంధం వ్యాపిస్తోంది. విజయవాడ, నూజివీడు రోడ్లలో డ్రైన్లు చెత్తతో నిండిపోయి కనిపిస్తున్నాయి. విజయవాడ రోడ్డులో గత వర్షాకాలంలో ఒకవైపు మాత్రమే పూడిక తొలగించగా, మరోవైపు నీరు నిలిచిపోయింది. దీంతో సైడ్ డ్రైన్లు కూడా ఎగదన్నుతూ మురుగు నిల్వై దోమలకు కేంద్రంగా మారాయి.
SKLM: మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఓపెన్ హౌస్‌లో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ZPHSలో శుక్రవారం మహిళా సాధికారకతపై ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బి నిహార్ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మార్పు అనేది ఇల్లు, పాఠశాల నుంచే మొదలవ్వాలని తెలిపారు. విద్యార్థులు బాధ్యతగా చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలన్నారు.
GNTR: రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యను ప్రాణాంతక విపత్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆమె లేవనెత్తారు.
కడప: జిల్లాలో భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్రీధర్ జ్యోతి ప్రజ్వలనతో సెన్సస్ అధికారులకు తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 1 నుంచి 30 వరకు హౌస్ లిస్టింగ్, డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
AP: పాలన అంటే నాలుగు బటన్లు నొక్కి వెళ్లిపోవడం కాదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలు.. వారి కాళ్లపై వారు నిలబడే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వృద్ధులు గౌరవంగా బతికే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే, ఉచిత బస్సును మహిళలు వినియోగించుకుంటున్నారని వెల్లడించారు.
SRPT: సూర్యాపేటలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు రంగంలోకి దిగారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి కొత్త బస్టాండ్ మరియు పూల సెంటర్ వరకు రోడ్లపై ఉన్న ఆక్రమణలను డీపీఓ సోమయ్యతో కలిసి ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తొలగించారు. వాహనదారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలతో పట్టణ ప్రధాన రహదారులు ఒక్కసారిగా క్లియర్ అయ్యాయి.
ప్రకాశం: మార్కాపురం నుంచి వస్తున్న కారు పొదలి నుంచి వెళ్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడే అటుగా వెళుతున్న దొనకొండ ఎస్సై త్యాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. అనంతరం పొదిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.