ASF: ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఫైళ్లను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని MPDO ఆదేశించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు.
WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులను సన్మానించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
AP: ఉత్పత్తులపై ప్రొడెక్ట్ కాలపరిమితి ముద్రించటం తప్పనిసరని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్యాకింగ్ ఫుడ్‌ను నిర్ధిష్ట నిబంధనలు అనుసరించి భద్రపరచాలని తెలిపారు. చాలాచోట్ల నిబంధనలు పాటించడం లేదన్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన దురదృష్టకరమన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. డార్క్ స్టోర్స్ పైనా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
E.G: తక్షణం చేపట్టాల్సిన ఆర్ అండ్ బి రోడ్డు పనుల ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశించారు. శుక్రవారం రాజానగరంలో DEE, AEలతో ఎమ్మెల్యే అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
ఖమ్మం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏజెంట్ల మధ్య మార్చి 4వ తేదీన జరిగిన గొడవలో టీ. చంద్రశేఖర్ (53) అనే పోస్టల్ ఏజెంట్‌పై తోటి ఏజెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి ముఖానికి గాయాలవ్వగా, ఖమ్మం వన్ టౌన్ ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి “ఆన్ సైట్” ఫిర్యాదును స్వీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి: జిల్లాలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఫిబ్రవరి నెలాఖరు వరకు జిల్లాలో మొత్తం ఒక కోటి 26 లక్షల మంది మహిళలు ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
MBNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3వ విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజానర్సింహా అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు పంతం చక్రపాణి, పంతం రవి కుటుంబ సభ్యులు రూ.1,05,000 ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం 21 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. మార్కండేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టకు రూ.51,000 విరాళం ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చక్రపాణి అన్నారు. అనంతరం వారిని ఆ సంఘం సభ్యలు సన్మానించారు.
KMM: నేలకొండపల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌లపై ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలోనే జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసులు సూచించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడు తూఅగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 101, 102 నంబర్లను సంప్రదించాలన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
AP: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్ రోడ్డు విషయం కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి రేకులపల్లి వెళ్లే రోడ్డు డైవర్షన్ రోడ్డు కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం డైవర్షన్ రోడ్డును ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సర్పంచ్ సరోజినీ దేవి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొదటి రోజు చిట్యాల పురపాలికలోని 12వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కమిషనర్ దండు శ్రీను ప్రతిజ్ఞ చేశారు. వీరందరూ స్వయంగా చీపుర్లు పట్టి వార్డులో చెత్తాచెదారాన్ని క్లీన్ చేశారు.
NDL: బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలో గొర్రెలు తొక్కిసలాట జరగడంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు నీటి గుంతలోకి నీరు త్రాగడానికి వెళ్లడంతో ఒకదానికి ఒకటి తొక్కిసలాట జరగడంతో.. 80 గొర్రెలు అక్కడే మృత్యువాత పడటంతో బాధితులు నగేష్, ఆంజనేయులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.