PLD: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పశుపోషకులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సూచించారు. శనివారం ఎమ్మెల్యే జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 29 వరకు గ్రామాల్లో ఉచిత టీకా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
SKLM: లోక్ అదాలత్‌తోనే సత్వర న్యాయం కలుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 11,602 కేసులు రాజీకి తగ్గట్టుగా గుర్తించామని, ఇందులో పదివేలకు పైగా కేసులు పరిష్కారం అవుతాయన్నారు. జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
VSP: పంచగ్రామల భూ సమస్యపై శనివారం సింహాచలం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నేత టీ.వీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వం హామీలు ఇచ్చినా సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికలలోపు సమస్య పరిష్కరించకపోతే 17 వార్డుల్లో గుణపాఠం చెబుతామన్నారు
WGL: ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. నగరంలోని భద్రకాళి ఆలయం ఆర్చి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజేంద్రప్రసాద్, గడ్డం రాకేష్, అభిలాష్, అనుదీప్ తదితరులున్నారు.
W.G: భార్య పీకను బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధలు కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు బ్లేడుతో కోసి పరారయినట్లు స్ధానికులు తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,48,633 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 747 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 38 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 3281 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణం తెలుగుపేట కాలనీలో ఇవాళ హేమంత్ కుమార్ అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా బోరుమని విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు: నగరంలో రహదారులు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన చెక్‌పోస్ట్ సమీపంలో నందికొట్కూరు రహదారి నుంచి నంద్యాల రహదారికి అనుసంధాన రహదారిని పరిశీలించారు.
W.G. భీమవరం పట్టణంలో ఆనంద ఫంక్షన్ హాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన నాయకులు పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు కనుగొనగా పార్టీని మరింత బలపరచాలని అన్నారు.
ATP: గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో శనివారం సాయంకాలం గ్యాస్ రీఫిలింగ్ స్థావరంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్సై గోపాలుడు మాట్లాడుతూ.. గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులను చేశామన్నారు. 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
SRPT: జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల కేంద్రాలను శనివారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు పరీక్ష సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సలహాలు సూచన అందించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు.
సత్యసాయి: తుళ్లూరులో ఈనెల 16న నిర్వహించనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సవిత శనివారం స్మృతి వనంలో జరుగుతున్న పనులు, ముఖ్యమంత్రి సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
NLG: మాడుగులపల్లి మండల కేంద్రంలో గల టోల్ ప్లాజా నందు ఈనెల 16 నుంచి వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నట్లు టోల్ ప్లాజా యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై ఉన్న ఈ టోల్ ప్లాజాను ఈ నెల 16 నుంచి రేట్ల పెరుగుదలపై పత్రాలు విడుదల చేశారు. టోల్ చార్జెస్ పెరుగుతున్నందువలన అటు వెళ్లే వాహనదారులు గమనించాలని కోరారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 15న జరిగే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధమైందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు పత్రాలను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తు చేయని వారు నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి రూ. 500 తత్కాల్ ఫీజు చెల్లించాలన్నారు.