ASR: గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ఏజెన్సీలో మరో 3,000 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేషన్ పెంచాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నాయక్ అధికారులను ఆదేశించారు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రబ్బరు సాగుకు అదనంగా 5 స్మోకింగ్ రూములు, జాఫ్రా రైతుల కోసం ప్రాసెసింగ్ మిషన్, ట్రాక్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
VSP: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన ప్రవేశాల ప్రచార పోస్టర్లను జిల్లా ఇంఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ప్రభుత్వ అంధ పాఠశాల, విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహాల్లో విద్యార్థుల చేరికను ప్రోత్సహించే ఉద్దేశంతో పోస్టర్లు రూపొందించారన్నారు.
VZM: చీపురుపల్లి మండలంలో చేపట్టే జనాభా లెక్కల నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డీడీవో కే.హేమ సుందర్ రావు అధికారులకు సూచించారు. ఈమేరకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టనున్న జనాభా లెక్కల కార్యక్రమంపై ఆయన పలు సూచనలు చేశారు.
KRNL: ఎమ్మిగనూరులోని రావుస్ డిగ్రీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం బీసీఏ విద్యార్థిని కే. అశ్విని ఖోఖో సౌత్ జోన్ జట్టుకు ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి ఆమె ఈ స్థానం సాధించింది. దావనగిరిలో జరిగే సౌత్ జోన్ ఖోఖో పోటీలలో ఆమె పాల్గొనుంది. కళాశాల సీఈవో తిరుమల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ ఆమెను అభినందించారు.
నంద్యాల జిల్లా బేతంచెర్లలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగమణికి వినతి పత్రం సమర్పించారు.
CTR: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా పులిచెర్ల PHC డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వంతో సహకరించి సమష్టిగా పోరాడితేనే టీబీని అంతం చేయవచ్చన్నారు. నాలుగు రోడ్ల కూడలిలో ఆరోగ్య సిబ్బంది మానవహారం నిర్వహించి, వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
GNTR: గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియానికి మహర్దశ తీసుకొస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో స్టేడియం అభివృద్ధి కోసం రూ.170 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ప్రకాశం: టంగుటూరు మండలం బాపూజీ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం బోలోరో బోల్తా పడింది. వినుకొండ నుంచి నాయుడుపేట వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. డివైడర్ పైన పడటంతో ట్రాఫిక్ సైతం అంతరాయం లేదు.
ATP: ‘సంపన్నకారి’ కార్యక్రమాన్ని పొదుపు సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శైలజ సూచించారు. మంగళవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏటా రూ.12 లక్షల టర్నోవర్ ఉండి, రెండేళ్ల అనుభవం ఉన్న సభ్యులకు ఆర్థిక సాయం, మార్కెటింగ్, బ్రాండింగ్‌లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.
KDP: మైదుకూరు పట్టణంలోని 16వ వార్డులో గల రామాలయంలో జరుగుతున్న మహోత్సవాల్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో గణపతి, సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
NLR: బుచ్చి మండలం జొన్నవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముందుగా జొన్నవాడ గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, నూతనంగా నిర్మించిన డ్రైనేజీలను, వాటర్ బోర్ పాయింట్లను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
BPT: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్తగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. మండల పరిషత్ నిధులు రూ.2.5 లక్షలతో ఈ పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో మంగళవారం RWS ఏఈ బాషా గ్రామంలో పర్యటించి, కొత్తగా ఏర్పాటు చేసిన చేతిపంపులను పరిశీలించారు.
E.G: గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను ఆమె జగన్‌కు వివరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
SKLM: పలాసలోని యూటీఎఫ్ నాయకులు మంగళవారం రణభేరి నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఐఆర్ 29% వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య: మదనపల్లి మున్సిపాలిటీకి జేసీ శర్మను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదల, పెండింగ్ పనుల పూర్తి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా మున్సిపల్ పరిపాలన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.