»Telugu Boy In Forbes Magazine Invented New Technology
Forbes Magazine: ఫోర్బ్స్ మ్యాగజైన్లో తెలుగు కుర్రాడు..కొత్త టెక్నాలజీ అదుర్స్
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతుల గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్ (Forbes Magazine) సమాజానికి తెలుపుతూ ఉంటుంది. తాజాగా ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఓ చిన్న స్టార్టప్ కంపెనీ గురించి కథనాన్ని ప్రచురించింది. వాహనాల రద్దీ అనేది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దానిని తగ్గించేందుకు ప్రభుత్వాలు, అధికారులు అనేక చర్యలు చేపట్టిన లాభం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. మరి ఈ సమస్యపైనే కొత్త టెక్నాలజీని ఓ తెలుగు కుర్రాడు కనిపెట్టాడు. అతనే కాటంరాజు సాయి ప్రజ్వల్ (Katamraju Sai Prajwal).
గుంటూరు (Guntur)కు చెందిన ఈ వ్యక్తి వెంకటేశ్వర బాలకుటీర్‌లో పదో తరగతి చదివాడు. కేఎల్ యూనివర్సిటీ (Kl university)లో బీటెక్ చేశాడు. అమెరికాలో పీజీ చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన జోర్డాన్ జస్టిన్‌తో కలిసి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అధునాతన కొత్త టెక్నాలజీని కనిపెట్టాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమాచారాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేయడం వల్ల వారు సులభంగా తమ ప్రయాణం సాగిస్తారు. ఏ రూట్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉందో తెలుసుకుని మిగిలిన రూట్లలో తమ ప్రయాణాన్ని సాగించే టెక్నాలజీతో చాలా మందికి ప్రయోజనం ఉంది.
ఈ టెక్నాలజీ విషయం టెక్ స్టార్స్ (Tech stars)వంటి వెంచర్ కాపిటలిస్ట్ కంపెనీ దీనిని అభివృద్ధి చేసేందుకు 12 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఈ యువ స్టార్టప్ కంపెనీ ప్రతినిధి అయిన కాటంరాజు సాయి ప్రజ్వల్ (Katamraju Sai Prajwal) గురించి ప్రత్యేక కథనం వెలువడింది. సాయిప్రజ్వల్ తండ్రి సుబ్బారావు కేఎల్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా ఉన్నారు. తమ కుమారుడి ప్రతిభ చూసి ఆనందం వ్యక్తం చేశారు.