»Ys Sharmila Says Kadiyam Srihari Is Telangana Betrayer
YS Sharmila: అసలు తెలంగాణ ద్రోహి కడియం
పద్నాలుగు ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఏమీ చేయని కడియం శ్రీహరి తనకు ఉచిత సలహాలు ఇస్తున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ ద్రోహి వైయస్ కాదని, ఏమీ చేయని కడియమే అన్నారు.
తెలంగాణ (Telangana) బదులు ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వెళ్లి రాజకీయం చేయాలని తనకు సూచించిన బీఆర్ఎస్ (BRS) నేత కడియం శ్రీహరికి (Kadiyam Srihari) వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) కౌంటర్ ఇచ్చారు. పద్నాలుగు ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్ ఘనపూర్‌కు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhar Reddy) సాగునీటిని అందించారని గుర్తు చేశారు. అలాంటి మహానేత తెలంగాణ ద్రోహి ఎలా అవుతారని నిలదీశారు. ఉద్యమాలను అడ్డుపెట్టుకుని పదవులను పొందిన ద్రోహి కడియం (Kadiyam Srihari) అని దుయ్యబట్టారు. హామీల రూపంలో కడియం, బీఆర్ఎస్ నేతలు చేసిన మోసాలను బయటపెడతామని చెప్పారు. వైయస్ తెలంగాణకు వ్యతిరేకి అని కడియం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తెలంగాణలో, స్టేషన్ ఘనపూర్‌లో అభివృద్ధి చేసినందుకు వ్యతిరేకా చెప్పాలని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా? లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు వ్యతిరేకా? 30 వేల ఇళ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా? రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు తెలంగాణకు వ్యతిరేకా? చెప్పాలన్నారు. నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేని నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అని మండిపడ్డారు.
తెలంగాణలో తనకు రాజకీయ పార్టీ ఎందుకు అంటూ తనకు ఉచిత సలహా ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. గతంలో 9 ఏళ్లు మంత్రిగా, ఆ తర్వాత నాలుగేళ్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం కనీసం ఎకరం భూమికి నీరు ఇవ్వలేదని ఆరోపించారు. అలాంటి నీవు తెలంగాణ వ్యతిరేకి కాదా అని అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా కడియం ఒక డిగ్రీ కాలేజీ, ఒక ఇంటర్ కాలేజీ తేలేకపోయిన మీరు తెలంగాణ వ్యతిరేకి అన్నారు. ఉద్యమం పేరు చెప్పి అధికారం, పదవులు అనుభవిస్తున్న కడియం శ్రీహరి లాంటివారు తెలంగాణ ద్రోహుల్లా తయారయ్యారన్నారు. నేను తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేకపోవడం వల్ల, ఇక్కడి వారికి కేసీఆర్ వెన్నుపోటు పొడవడం వల్ల… రాజశేఖర రెడ్డి బిడ్డను అయిన నేను ఈ గడ్డ పైనే చదువుకున్నానని, ఈ గడ్డ పైనే పెరిగానని, ఈ గడ్డ మీదనే పెళ్లి చేసుకున్నానని, ఇదే తెలంగాణ గడ్డ మీదనే నా కొడుకును, నా బిడ్డను కన్నాను కాబట్టి… ఈ గడ్డకు సేవ చేయాలన్న బాధ్యత, హక్కు నాకు ఉన్నాయని భావించి, పార్టీ పెట్టినట్లు చెప్పారు.
కేసీఆర్ బంగారం పళ్లెంలో.. బంగారు తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, అందుకే తాను పాదయాత్ర చేస్తూ, ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, రైతులకు రుణమాఫీ.. ఈ హామీలు ఎందుకు నెరవేర్చే దిశగా తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఏపీ సీఎం జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చునని, అక్కడ షర్మిలకు అవకాశం రావొచ్చునని, కాబట్టి తెలంగాణలో తిరిగి సమయం వృథా చేసుకోవడానికి బదులు అక్కడికి వెళ్తే మంచిదని కడియం శ్రీహరి (Kadiyam Srihari) సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు రాజకీయ సలహాలు ఇస్తున్నది, రాజకీయంగా ముందుకు నడుపుతున్నది ఎవరో తనకు తెలియదు కానీ… ఆమె తప్పుడు సలహాలు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో తిరగడం ద్వారా తన సమయాన్ని, శక్తిని, వనరులను వృథా చేసుకోవడం తప్ప మరేమీ లేదన్నారు. వైయస్ కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమని చెప్పారు. దీనిపై తాజాగా షర్మిల (Sharmila) గట్టి కౌంటర్ ఇచ్చారు.