ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కలత చెందారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏపీకి రెండు కళ్లులాంటివని వాటిని నిర్వీర్యం చేస్తున్నాడని సీఎం జగన్ పై మండిపడ్డారు. ఒక సైకో వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా కావడానికి వీల్లేదని చెప్పారు. జగన్ ఊసరవెల్లి కంటే దారుణంగా మారుతున్నాడని, అతడిని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు.
ఏపీ రాజధాని విషయంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై గురువారం చంద్రబాబు స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లులాంటి అమరావతి, పోలవరం ప్రాజెక్టును దెబ్బతీశారని మండిపడ్డారు. రాజధాని విషయంలో మొండిగా చట్ట విరుద్ధంగా, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలతో పాటు న్యాయస్థానాలు కూడా అమరావతికే మద్దతు పలికాయని, కానీ సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖకు మారుస్తున్నాడని తెలిపారు.
‘అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్ ఏం చెప్పారు. రాజధానిగా అమరవాతి ఉంటుంది. మా పార్టీ కన్నా గొప్పగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మూడు రాజధానుల పేరిట డ్రామాలు ఆడుతూ ఇచ్చిన మాట తప్పాడని పేర్కొన్నారు. ‘అమరావతి రాజధాని కోసం 29 వేల మంది రైతులు 37 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానిపై రూ.11,395 కోట్లు తాము ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం విషం చిమ్మింది’ అని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతిపై వైఎస్సార్ సీపీ నాయకులు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేలాయి. అమరావతి నిర్మాణం సాగి ఉంటే పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీగా ఆదాయం లభించేది. ప్రజావేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసే దాకా వచ్చింది. మభ్య పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో అనకొండ. ఏం ఒరగబెట్టడానికి విశాఖ వెళ్తున్నాడు జగన్? ఇప్పటికే రూ.45 వేల కోట్లు దోచుకుని, గంజాయి రాజధానిగా విశాఖను మార్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారు. రుషికొండకు బోడిగుండు కొట్టించిన ఘనుడు జగన్. ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డిని దోషిగా నిలబెట్టి తీరుతాం’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ అని చంద్రబాబు తెలిపారు. అతడి విధ్వంసకర చర్యలతో మళ్లీ కోలుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ ను చేశారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో అమరావతి రాజధానిపై జగన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.