దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని అభిప్రాయ పడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించుకుందామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రపతి ప్రసంగం ఇలా కొనసాగింది.. ‘అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. భారత్ మునుపెన్నడూ లేని విధంగా ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది. భారత డిజిటల్ నెట్ వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరంగా మారింది. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాకాలు అందిస్తోంది. ఇప్పుడు ఉన్న ధైర్యవంతమైన, నిర్ణయాత్మమైన ప్రభుత్వం. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించాం. చిన్న, సన్న కారు రైతులను ఆదుకుంటున్నాం. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం.’ అని తెలిపారు.