తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఈ చిత్రం స్టోరీ ఎలా ఉంది? మూవీ హిట్టా ఫట్టా తెలుసుకుందాం.
రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ రేంజ్ కామెడీ హీరోగా.. అల్లరోడుగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం ఉన్న అతి తక్కువ మంది కమెడియన్ హీరోలలో అల్లరి నరేష్ కూడా ఒకడు. అయితే అల్లరోడి అల్లరికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. సరైన కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు. కరోనా తర్వాత సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. బలమైన కథ ఉంటే తప్పా సినిమాలు ఆడే పరిస్థితులు లేవు. అందుకే నరేష్ కామెడీ సినిమాలు పక్కన పెట్టి.. కంటెంట్ ఓరియేంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేసిన సినిమానే నాంది. అప్పటి వరకు వరుస ఫ్లాప్స్‌లో ఉన్న నరేష్‌కు నాంది సినిమా సాలిడ్ హిట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. విజయ్ కనకమేడాల దర్శకత్వంలో ‘ఉగ్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. మరి ఉగ్రం ఎలా ఉంది? థియేటర్లో అల్లరోడు ఉగ్రరూపం చూపించాడా?
కథ విషయానికొస్తే
సిఐ శివ కుమార్ (అల్లరి నరేష్) వరంగల్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను అపర్ణతో (మీర్నా మీనన్) ప్రేమలో పడతాడు. పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఓ ఐదేళ్లు వీళ్ల సంసార జీవితం హ్యాపీగా సాగుతుంది. ఓ పాప కూడా పుడుతుంది. అయితే ఇలాంటి సంతోషకరమైన కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఊహించని విధంగా.. ఓ మాఫియా గ్యాంగ్‌కు శివ ఫ్యామిలీ టార్గెట్ అవుతుంది. దాంతో శివ భార్య మరియు కూతురు కిడ్నాప్ అవుతారు. అది ఒక యాక్సిడెంట్లో జరగడంతో హీరో గతం మర్చిపోతాడు. ఇక ఆ తర్వాత ఏమయింది? తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసింది ఎవరు? గతం మర్చిపోయిన హీరో ఏం చేశాడు? శివ కుమార్ నేపథ్యం ఏంటి? అసలు ఈ శివ కుమార్ ఎవరు? అనేదే అసలు కథ.
ఎలా ఉందంటే
ఇక సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ.. అసలు కథలోకి ఎంటర్ అయినప్పటి నుండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ విజయ్ కనకమేడాల. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది. సెకెండ్ ఆఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు బాగున్నా.. ఓవరాల్‌గా సినిమా సోసోగానే నిలిచిందని చెప్పాలి. అయితే అల్లరి నరేష్ మరోసారి సీరియస్ రోల్లో అదరగొట్టేశాడు. ఈ సినిమా కోసం నరేష్ ట్రాన్స్ఫర్మేషన్ మెప్పిస్తుంది. ఇతను మన కామెడీ హీరో అల్లరోడేనా? అనే డౌట్స్ వచ్చేలా చేశాడు నరేష్. అతని భార్యగా మిర్నా మీనన్ బాగానే నటించింది. డాక్టర్ పాత్రలో ఇంద్రజ ఒదగిపోయింది. మిగిలిన పాత్రలు కూడా ప్రేక్షకులని మెప్పిస్తాయి. కాకపోతే ఎమోషన్ కాస్త హెవీ డోస్‌లా అనిపిస్తుంది. ఆడియెన్స్ ఫుల్లుగా సాటిస్ఫై అవకపోయినా.. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ‘ఉగ్రం’ ఓకే అనిపిస్తుంది. మొత్తంగా అల్లరోడి ఉగ్రరూపాన్ని ఒకసారి చూడొచ్చు. అల్లరి నరేష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కోసం అయినా సినిమాను చూడొచ్చు. కానీ నాంది రేంజ్ మూవీ మాత్రం కాదనే చెప్పాలి.