»Aa Okkati Adakku Review Did The Movie Aa Okkati Bring Laughter
Aa Okkati Adakku Review: ఆ ఒక్కటీ అడక్కు చిత్రం నవ్వులు పూయించిందా?
కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వంలో వచ్చిన ఆ.. ఒక్కటీ అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించారు. హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా నటించారు. మరి ఈ చిత్రం నవ్వులు పూయించిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
కథ
గణపతి(అల్లరి నరేష్) ప్రభుత్వ ఉద్యోగి. ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. అయితే అతనికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాదు. కానీ తన తమ్ముుడి(రవికృష్ణ)కి వివాహం జరుగుతుంది. తన మేనమామ కూతురు (జెమీ లివర్)ను ఇచ్చి గణపతి పెళ్లి చేస్తాడు. ఇంట్లో కూడా చాలా సంబంధాలు చూస్తారు. కానీ సెట్ కావు. దీంతో అతను మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు. అలా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. తనను ఇష్టపడతాడు. కానీ ఆమె గణపతి పెళ్లి ప్రపోజల్‌ను రిజక్ట్ చేస్తుంది. అయితే గణపతి తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. దీంతో ఆమెను సంతోష పెట్టడానికి సిద్ధిని ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కానీ ఆ తర్వాత రోజే ఆమె గురించి ఓ వార్త బయటకు వస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకుని, అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అని వార్తలు వస్తాయి. మరి దీని తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యమేంటి? ఆమె నిజంగానే మోసం చేసిందా? మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? వాళ్ల ఆగడాలను గణపతి ఎలా ఆటకట్టించాడు? సిద్ధి గురించి నిజం తెలిశాక గణపతి ఏం చేశాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
పెళ్లి కాని కుర్రాడిగా తన ఫ్రస్టేషన్‌ను చూపెడుతూ ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో నరేష్ పాత్రను పరిచయం చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. గణపతి కుటుంబ నేపథ్యం.. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ చేసే హంగామా బాగుంటుంది. అలా గణపతి పెళ్లి చూపుల ఎపిసోడ్ సరదా సరదాగా ఉంటుంది. సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్‌గా మారుతుంది. ఇక హ్యాపీ మ్యాట్రిమోనీలో సభ్యుడిగా చేరాక గణపతికు ఎదురయ్యే అనుభవాలు ఓవైపు నవ్విస్తూనే ఆలోచింపజేయిస్తాయి. కాకపోతే ఆ తర్వాత నుంచి కథలో వినోదం కంటే సీరియస్‌నెస్ పెరుగుతూ పోయింది. విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అది చూశాక గణపతి కూడా ఆమెతో చేతిలో మోసపోనున్నాడా? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో ఓవైపు గణ లవ్‌ట్రాక్‌ను చూపిస్తూనే.. మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. దీంతో కథ పూర్తిగా సీరియస్‌గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. దీంట్లో చూపించిన ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్వులు పూయించింది. గణపతి కెరీర్ పరంగా మంచిగా స్థిరపడినా.. తనకు పెళ్లి కాకపోవడానికి వెనకున్న కారణం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. సినిమాని ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
గణపతి పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించలేకపోయారు. సిద్ధి పాత్రలో ఫరియా అందంగా కనిపిస్తుంది. తన నటన కూడా ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని జెమీ లివర్ చేసే నటన నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కూడా నవ్విస్తాయి. మిగిలిన పాత్రలు వాళ్ల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక అంశాలు
నిర్మాణ పరంగా సినిమా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కామెడీతో సందేశాన్ని ప్రేక్షకులకి తెలియజేయాలనుకున్నాడు. కానీ ఈ విషయంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు.