»Telangana Balagam Movie Unites A Family And Two Brothers In Nirmal Mancherial Districts
బంధాలను ఏకం చేస్తున్న ‘బలగం’.. ఓ కుటుంబాన్ని, ఇద్దరు సోదరులను కలిపిన చిత్రం
ఈ సినిమా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిర్మాత దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుకు ఎవరూ జంకడం లేదు. ఇది మా సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేస్తున్నారు.
దశాబ్దాల తర్వాత కుటుంబసభ్యులు (Family) కలిసి ఉమ్మడిగా చూసే సినిమా వచ్చింది. అందుకే ప్రజలంతా పంచాయతీ కార్యాలయం, గ్రామం నడిబొడ్డున సినిమాలు బహిరంగ ప్రదర్శన వేస్తున్నారు. ఇంకా కొందరు సర్పంచ్ లు (Sarpanch) ప్రత్యేకంగా ఈ సినిమా ప్రదర్శన చేస్తున్నారు. వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వం వహించిన బలగం సినిమా (Balagam Movie) ఇంటిల్లిపాదిని అలరిస్తున్నది. అనుబంధాలను పంచే ఈ చిత్రం విడిపోయిన కుటుంబాలను కలిపివేస్తోంది. కుటుంబ అనుబంధాలపై బలగం సినిమా తీవ్ర ప్రభావం చూపుతోంది. విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయి.. కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ సినిమా చూశాక దూరంగా ఉన్న ఇద్దరు సోదరులు (Brothers) కలిసిపోయారు. మరో కుటుంబం ఒక్క చోటకు చేరింది. భేదాభిప్రాయాలతో దూరమైన కుటుంబసభ్యులు మళ్లీ ఒక్కటయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా (Nirmal District) లక్ష్మణచాందకు చెందిన అన్నదమ్ములు పోసులు, రవి. ఓ స్థలం వివాదంలో (Land Clashes) గొడవలు జరుగుతుండడంతో వారు విడిపోయారు. అయితే ఇటీవల విడుదలైన బలగం సినిమాను గ్రామ సర్పంచ్ సురకండి ముత్యంరెడ్డి (Surakandi Muthyamreddy) గ్రామస్తులకు చూపించారు. ఓ ఫంక్షన్ హాల్ లో ప్రదర్శించిన సినిమాకు అన్నదమ్ములు పోసులు, రవి కూడా వచ్చారు. సినిమా చూసిన అనంతరం వీరిద్దరూ కలిసిపోయారు. తమ భూమి సమస్య పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చారు. సర్పంచ్ సమక్షంలో భూ వివాదాన్ని పరిష్కరించుకుని ఈ అన్నదమ్ములు ఏకమయ్యారు.
ఇక మంచిర్యాల జిల్లాలో (Mancherial District) మరో కుటుంబం కలిసిపోయింది. 45 ఏళ్ల కిందట విడిపోయిన ఓ కుటుంబం బలగం సినిమా ద్వారా ఏకమైంది. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బాన్ రెడ్డి-పోసక్క దంపతులకు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు. మంచిర్యాల, కరీంనగర్, భూపాల్ పల్లి జిల్లాలో వీరి కుటుంబాలు స్థిరపడ్డాయి. అయితే పెద్ద కుమారుడు పుప్పిరెడ్డి బాపురెడ్డి, కోడలు సరోజన దంపతులు ప్రత్యేక చొరవ తీసుకుని కుటుంబసభ్యులందరినీ ఒక చోటకు చేర్చారు. ఆదివారం మంచిర్యాలలో దాదాపు 48 మంది కుటుంబసభ్యులు బలగం సినిమా చూశారు. బంధుత్వాలపైన బలగం సినిమా చూపించడంతో ఆ చిత్రంలోని కొన్ని సీన్లకు కంటతడి పెట్టారు.
సినిమాలో మాదిరి తాము దూరం దూరం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తించారు. దీంతో 45 ఏళ్ల అనంతరం బాన్ రెడ్డి-పోసక్క కుటుంబం ఒక్క చోటకు చేరింది. సినిమా అనంతరం ఓ ఫంక్షన్ హాల్ కుటుంబసభ్యులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆటాపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు తమలో తాము బాధపడుతూ సంతోషంగా గడిపి ఆ బాధనంతా పోగొట్టుకున్నారు. కాగా బలగం సినిమా కుటుంబాలపై ఇంతగా ప్రభావం చూపడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో చర్చనీయాంశమవుతున్నది.
బలగం సినిమా మార్చ్ 3వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మార్చి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ఇంటిల్లిపాది ఒక చోటకు చేరి చూస్తున్నది. ఇక గ్రామాల్లో బహిరంగ ప్రదర్శనలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిర్మాత దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుకు ఎవరూ జంకడం లేదు. ఇది మా సినిమా అంటూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు కూడా తమ బలగం కోసం బలగం సినిమా ఉచితంగా ప్రదర్శన చేస్తున్నారు.