తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోను… తన తండ్రి తనను ఎంతగానో చదివించాలని ఆశపడటంతో ఆ బాధలోను పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాడు ఓ విద్యార్థి (Tenth Student). ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కండెం మండలంలో చోటు చేసుకున్నది. తాను బాగా చదివి, ప్రయోజకుడిని చేయాలనేది ఆ తండ్రి కోరిక. అందుకే శవం ఇంట్లో ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు చెప్పడంతో తండ్రి కోరుకున్న చదువును మధ్యలో డిస్టర్బ్ చేయకుండా పరీక్షలు రాసి వచ్చాడు. బెల్లాల్ పంచాయతీ మొర్రిగూడెంకు చెందిన చిన్న వెంకటి, భార్య గంగవ్వకు ఇద్దరు కొడుకులు. వారు రాజ్ కుమార్, రోహిత్. భార్యాభర్తలు వ్యవసాయ కూలీలు. చిన్న కొడుకు రోహిత్ కడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
వెంకటి అనారోగ్య కారణాల వల్ల వారం క్రితం జగిత్యాలలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్ను మూశాడు. సోమవారం ఉదయం దహన సంస్కారాలు చేయవలసి ఉంది. అదే సమయంలో చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో అందరూ చర్చించి, తండ్రి తన కొడుకును బాగా చదివించాలని కోరుకోవడంతో… పరీక్ష రాసి వచ్చాక దహన సంస్కారాలు చేద్దామని నిర్ణయించారు. ఆ కొడుకు కూడా బరువెక్కిన హృదయంతో పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసి వచ్చాడు. అతను వచ్చే వరకు వేచి చూసి ఉండి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన అక్కడున్న వారిని అందరీకీ కన్నీళ్లు తెప్పించింది.