»Pulivendula Non Bailable Case Filed Against Tdp Leader Btech Ravi In Chakrayapeta Police Station
Pulivendulaపై జగన్ భయం.. బీటెక్ రవిపై కేసు నమోదు
టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అనూహ్య విజయంతో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఖంగు తిన్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ (Pulivendula) అత్యధికంగా టీడీపీకి ఓట్లు రావడంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే తన నియోజకవర్గంలోని టీడీపీ నాయకులపై ఏపీ ప్రభుత్వం కక్షగట్టింది. ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్షపూరిత చర్యలు తీవ్రమయ్యాయి. తాజాగా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవిపై (Btech Ravi) కేసు నమోదైంది. అతడితో పాటు 30 మందిపై నాన్ బెయిలబుల్ కేసు (Non-bailable Case) నమోదు చేశారు.
కడప జిల్లా (Kadapa District) చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు. దౌర్జన్యానికి పాల్పడిందే కాక బీటెక్ రవి తన అనుచరులతో తమపై దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ నాయకులు పోలీసులకు (Chakrayapeta Police) ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు ఇచ్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం గమనార్హం.
స్థలం వివాదం విషయంలో ఒక నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం ఎక్కడా చూసి ఉండరు. కాగా ఆ భూమిపై కోర్టులో విచారణ జరుగుతోంది. కేసు విచారణలో ఉండగానే వైసీపీ నాయకుడు సుబ్బయ్య భూమి కబ్జా చేసేందుకు యత్నించాడు. ఆ భూమిలో వెంచర్లు వేస్తూ కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీనిని నిలదీస్తే టీడీపీ నాయకులపైనే కేసు నమోదవడం ఏపీ పోలీసులకే చెల్లింది. కాగా ఈ కేసుల నమోదుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ (TDP) నాయకులపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మొన్న టీడీపీ ఎమ్మెల్యే భర్త, అతడి సన్నిహితులను సీఐడీ అరెస్ట్ చేయడం.. తాజాగా బీటెక్ రవిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం కక్షపూరిత చర్యలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొన్ని రోజులు ఆగితే జగన్ పీడ విరగడ అవుతుందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు ఇలాంటి వేధింపులు, కక్షపూరిత చర్యలు తప్పవని పులివెందుల నాయకులు చెబుతున్నారు.