»Prime Minister Modi To Telangana On July 12th 2023
Modi: జూలై 12న తెలంగాణకు ప్రధాని మోడీ!
ప్రధాని మోడీ(modi) జూలై 12న తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేసేందుకు రానున్నట్లు తెలిసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ(narendra modi) జూలై 12న రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని బీజేపీ తెలిపింది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేట(kazipet)లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (POH) సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈ నెలాఖరులోగా ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉండగా, కార్యక్రమం వాయిదా పడి జూలై 12న ఆయన వస్తారని పార్టీ నేతలు తెలిపాయి. అదే రోజు వరంగల్లో సమావేశం నిర్వహించేందుకు చర్చిస్తున్నామని, రెండు రోజుల్లో ప్రధాని పర్యటన ఖరారు కానుందని వెల్లడించారు.
ఈ క్రమంలో 11 మంది రాష్ట్ర బీజేపీ నేతలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జూలై 8న హైదరాబాద్(hyderabad) వేదికగా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమావేశం కీలకం కానుంది. దీంతోపాటు ప్రధాని రాక పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల పార్టీ నేతలతో కీలక భేటీకి హైదరాబాద్ వేదికగా మారిన సంగతి తెలిసిందే.
వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది బీజేపీ(BJP) బూత్ కమిటీ సభ్యులు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మంగళవారం భోపాల్లో జరిగిన ‘మేరా పోలింగ్ బూత్… సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రత్యేక రైలులో రాష్ట్రానికి చేరుకుంటారు. మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్లో మూడు గ్రూపులుగా విభజించనున్నారు. వీరంతా జూలై 5 వరకు రాష్ట్రంలోనే ఉండి బీజేపీని బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. భోపాల్లో జరిగిన ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి వారిని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.