»Prime Minister Modi Laid The Foundation Stone For Rs 6100 Crore Works For Telangana July 8th 2023
Modi: నేడు తెలంగాణకు ప్రధాని మోడీ..రూ.6109 కోట్ల పనులకు శంకుస్థాపన
తెలంగాణలోని వరంగల్(warangal) సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఈరోజు(జులై 8న) తెలంగాణకు రానున్నారు. మొత్తం సుమారు రూ. 6,100 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని మోడీ(modi)నేడు (జులై 8న) తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్లో దాదాపు రూ.6,109 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టురు శంకుస్థాపన చేయనున్నారు. రూ.500 కోట్లతో కాజీపేట రైల్ వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీ రోలింగ్ స్టాక్ తయారీ సామర్థ్యాన్ని, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించనుంది. రూ.5,550 కోట్లతో చేపట్టనున్న రెండు జాతీయ రహదారుల పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. నాగ్పూర్-విజయవాడ కారిడార్లోని మంచిర్యాల-వరంగల్ సెక్షన్లో జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ రహదారి ద్వారా మంచిర్యాల-వరంగల్ మధ్య 34 కి.మీ.దూరం తగ్గుతుంది. దీంతోపాటు పాటు 44, 65 జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. జాతీయ రహదారి 563లో కరీంనగర్-వరంగల్ సెక్షన్లో రెండు వరుసల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ముందు మోడీ జిల్లాలోని ప్రఖ్యాత భద్రకాళి ఆలయాన్ని సందర్శించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మోడీ తెలంగాణలో పర్యటించడం ఇది మూడోసారి. గతంలో జనవరి, ఏప్రిల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొత్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్ రెడ్డి(kishan reddy) సీనియర్ నేతలతో కలిసి ఇప్పటికే వరంగల్ చేరుకున్నారు. మోడీ పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా బందోబస్తు చర్యలు సజావుగా సాగేందుకు వీలుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ వరంగల్ కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి(prime minister) పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 3,500 మంది పోలీసులను మోహరించనున్నట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేయబడింది.