తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద సిటీ అయిన వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే మూడుకుపైగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేశాయి. తాజాగా మరో సంస్థ అయిన ఎల్టీఐ మైం డ్ ట్రీ(LTI mindtree) ఈ నెలాఖరు నాటికి తమ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ను మైం డ్ ట్రీ సంస్థ ప్రతినిధులు కలిసి వరంగల్లో ఏర్పాటు చేసే తమ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. దీంతో మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇక ఎల్టీఐ మైం డ్ ట్రీ సంస్థకు 30 దేశాల్లో బ్రాంచులు ఉండగా..దాదాపు 90 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇప్పటికే జెన్ పాక్ట్, సైయంట్ టెక్, టెక్ మహేంద్ర, కాకతీయ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయి. కాగా తాజాగా మైం డ్ ట్రీ ఏర్పాటుతో మరికొంత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరానికి మంచి భవిష్యత్ ఉండబోతుంది. మరోవైపు త్వరలో ఈ నగరంలో మెట్రో కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.