»Maharashtra Sharad Pawar Steps Down As Ncp President
Sharad Pawar సంచలన నిర్ణయం.. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా
మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది.
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి. బీజేపీ సాగిస్తున్న లాలూచీ రాజకీయాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP)లో ఏర్పడిన విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన సీనియర్ నాయకుడు, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ (Ajit Pawar) చేస్తున్న రాజకీయాలపై పవార్ కలత వహించాడు. అతడితో బీజేపీ దోస్తీ కొనసాగిస్తూ ఎన్సీపీలో చీలికకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ పదవిని వీడుతూ పవార్ రాజీనామా చేశారు.
మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో (Shiv Sena) చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో బీజేపీ లోపాయికారి రాజకీయాలు మొదలుపెట్టింది. అబ్బాయితో బీజేపీ చర్చలు జరుపుతుండడంపై శరద్ పవార్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో అజిత్ చర్చలు జరుపుతున్న వైనాన్ని తట్టుకోలేకపోయారు.
మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయంపై సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తనకు ఇంకా మూడేళ్ల రాజ్యసభ పదవీకాలం ఉందని, ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు. కాగా అబ్బాయి రాజకీయాలు నచ్చని సీనియర్ నాయకుడు శరద్ పవార్ పదవి నుంచి వైదొలిగాడు. దీంతో ఎన్సీపీలో భారీ కుదుపు వచ్చింది. పవార్ రాజీనామాతో (Resignation) మహారాష్ట్రలో వేగంగా పరిణామాలు మారే అవకాశం ఉంది. పవార్ వైదొలగడంతో ఇక అధికారికంగానే అజిత్ పవార్ బీజేపీతో చేయి కలపనున్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అజిత్ చేరే అవకాశం కూడా లేకపోలేదు. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం.. ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండేను నియంత్రణలో ఉంచుకునేందుకు బీజేపీ ఆడిస్తున్న ఈ నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
1 మే 1960లో రాజకీయ జీవితం ప్రారంభించిన శరద్ పవార్ 63 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1999లో పవార్ ఎన్సీపీని స్థాపించారు. పలుమార్లు కాంగ్రెస్ తో జత కట్టి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు. ‘సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తున్న నా రాజకీయ జీవితానికి ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలి’ అని శరద్ పవార్ తెలిపి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.